ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖాముఖి మాట్లాడుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి జగన్ హాజరయ్యారు. కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇద్దరూ ఒకే సమయంలో రావడంతో ఒకే కుర్చీలో కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. వారి మధ్య చర్చలు సీరియస్‌గా సాగినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల గురించే మాట్లాడుకున్నట్లుగా భావిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ఉందనిచివరి వరకూ తెలియదు. అయితే హఠాత్తుగా ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి పెళ్లికి హాజరయ్యారు. దీంతో కేసీఆర్‌తో సమావేశం అయ్యేందుకు పెళ్లికి హాజరయ్యారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కేసీఆర్ ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునే వస్తామని ఈ రోజు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. కరెక్ట్‌గా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే సమయంలోనే జగన్ కేసీఆర్‌తో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది.
గతంలో ఇద్దరు ముఖ్యమమంత్రులు పలుమార్లుభేటీ అయ్యారు. తర్వాత రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్నా.. జల వివాదాల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పలు లేఖలు రాశారు. వారి తీరు వల్ల కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా కేంద్రం ఇచ్చింది.అయితే రాజకీయంగా మాత్రం ఇరువురు ఆత్మీయంగా ఉంటున్నారని ఇచ్చిపుచ్చుకుంటున్న వ్యవహారాలను బట్టి అర్థమవుతోందంటున్నారు. మొత్తానికి సడెన్‌గా జరిగిన కేసీఆర్, జగన్ భేటీ రాజకీయ రంగాన్ని మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.