కలెక్టర్ ప్రతీ మీనాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్. కలెక్టర్ కు క్షమాపణ చెప్పినా కూడా వివాదం సద్దుమణగలేదు. ప్రీతీ మీనా కూడా వెనక్కి తగ్గకుండా ఐ.ఎ.ఎస్.ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇంకోపక్క ప్రతిపక్షాలు కూడా పట్టువదలడం లేదు! మహిళా కలెక్టర్ విషయంలో శంకర్ నాయక్ వ్యవహరించన తీరుపై ప్రభుత్వం స్పందన తూతూ మంత్రంగా ఉందనీ, అలాంటివారిపై స్టేషన్ బెయిల్ ఇచ్చేంత సౌలభ్యం ఉన్న సెక్షన్లను ఎంచుకుని కేసులు పెట్టడమేంటంటూ విమర్శిస్తున్నాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, శంకర్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ నాయక్ విషయమై తెరాసలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి! ఆయనపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే పార్టీ పరువు పోయేలా ఉందనే చర్చ జరుగుతోందని, ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది!
కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన తరువాత శంకర్ నాయక్ తీరు మారడంపై తెరాస వర్గాలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. చేయని తప్పునకు తనతో క్షమాపణలు చెప్పించారనీ, తన చుట్టూ కుట్ర జరుగుతోందని ఆయన మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. అంటే, ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఆగ్రహించారు కాబట్టే తాను కలెక్టర్ కు సారీ చెప్పాల్సిన వచ్చిందన్నట్టు మాట్లాడారు. అయితే, ఇదంతా జరిగిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు శంకర్ నాయక్ ప్రయత్నించారు! మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. కానీ, ఆయన్ని కలిసేందుకు సీఎం టైమ్ ఇవ్వలేదు. కానీ, ఎలాగైనా సరే ముఖ్యమంత్రిని కలుసుకుని తన వివరణ చెప్పుకుందామన్న ఉద్దేశంతో ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. అయితే, అక్కడికి కూడా ఆయన్ని అనుమతించకపోవడం విశేషం. దీంతో సీఎం కోసం కొంతసేపు వెయిట్ చేసి, తరువాత చేసేది లేక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.
శంకర్ నాయక్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న ఈ తరుణంలో ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం సరికాదనే ఉద్దేశంతోనే సీఎం నిరాకరించి ఉంటారని కొంతమంది అంటున్నారు. అయితే, ఆయనపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలనీ, లేదంటే పరువు పోయే పరిస్థితి వస్తుందనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సీఎంకు కూడా నివేదించారనీ, అందుకే శంకర్ నాయక్ కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా నిరాకరించి ఉంటారని చెబుతున్నారు. మొత్తానికి, ఈ వ్యవహారంతో ఆయన్ని పక్కన పెట్టేయడం ఖాయమనే వ్యాఖ్యానాలు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి.