గరీబీ హటావో. ఈ నినాదమే 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టింది. సంపూర్ణ స్వరాజ్యం- ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం.. ఇది 1977లో జనతా పార్టీని అధికారంలోకి తెచ్చింది. తెలుగు వారి ఆత్మ గౌరవం. ఈ నినాదమే 1983లో ఎన్టీఆర్ పార్టీ తెలుగు దేశానికి తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టింది. డబుల్ బెడ్ రూం ఇల్లు. ఈ నినాదం ఇప్పుడు తెలంగాణలో తెరాసకు ట్రంప్ కార్డుగా మారింది.
కట్టింది ఒకే ఒక్క భవనం. హైదరాబాదులో డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాన్ని నిర్నించిన కేసీఆర్ ప్రభుత్వం, దానినే తురుపు ముక్కగా చేసుకుంది. ప్రతి ఎన్నికల్లో ఆ భవనాన్నే చూపిస్తోంది. సామన్యుడికి అలాంటి, సౌకర్యవంతమైన ఇండ్లు కట్టిస్తామని పదే పదే చెప్తోంది. రెండు లక్షల ఇండ్ల నిర్మాణానికి పక్కా స్కెచ్ వేశామని ప్రకటిస్తోంది. హైదరాబాద్ సహా పది జిల్లాల్లోనూ పేదల కలల ఇండ్ల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది.
ఇప్పటి వరకూ ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇచ్చిన పక్కా ఇల్లంటే అగ్గిపెట్టేలా ఉంటుంది. కనీసం పూర్తిగా కాళ్లు చాపుకొనేటంత జాగా కూడా లేని గదులు, ఇరుకు రూములు, కదలడానికి వీలుకాని వంటిల్లు, నామ్ కే వాస్తేగా బాత్ రూము. ఇదీ భారత దేశ వ్యాప్తంగా పక్కా ఇళ్ల మతలబు. గతంలో ఇందిరా గాంధీ హయాంలో దళితులకు, ఇతర వర్గాల పేదలకు పెద్ద సంఖ్యలో పక్కా ఇండ్లను నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం. ఊరికి దూరంగా, ఇరుకు గదులతో ఉన్న ఆ ఇళ్లు అగ్గిపెట్టెలను తలపిస్తాయి. అయినా సరే ఏదో ఒక సొంత గూడు దొరికిందని సామాన్యులు సంబరపడ్డారు.
తెలంగాణ ఉద్యమ యోధుడిగా ఖ్యాతి పొందిన కేసీఆర్, ఈ రాష్ట్రంలో పేదలు కూడా మంచి సొంత ఇండ్లలో ఉండాలని కలలు గన్నారు. మరీ కోటీశ్వరులు కాకపోయినా కనీసం మధ్య తరగతి వారి తరహాలో విశాలమైన ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అయితే, గత 19 నెలల్లో ఒక్క కాంప్లెక్స్ ను మాత్రమే నిర్మించారు. వరంగల్ లో నాలుగైదు నెలల్లో సొంత ఇల్లు మీ సొంతమవుతుందని మురికివాడల ప్రజలకు 13 నెలల క్రితం హామీ ఇచ్చారు. అది ఇంత వరకూ అమలు కాకపోవడం ఆశ్చర్యమే. అలాగే, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామంటూ రేకుల షెడ్లు, పెంకుటిళ్లను కూల్పించారు. కానీ అక్కడ ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఆ కుటుంబాల వారు ఇప్పుడు టెంట్లలో నివసిస్తున్నారు.
ఇలాంటి కొన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించాలనే కేసీఆర్ సంకల్పాన్ని ఎవరూ అనుమానించడం లేదు. కాస్త వెనుకనో ముందో ఇండ్లు కట్టిస్తారనే పేద ప్రజలు నమ్ముతున్నారు. గరీబు కుటుంబాల వారికి గౌరవప్రదమైన ఇల్లు సమకూరితే అదే స్వర్గం. అంత కంటే ఇంకేం కావాలి? అందుకే, కేసీఆర్ హామీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికైనా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా, నారాయణ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికైనా, ప్రజలు భారీ మెజారిటీతో కారును పరుగులు తీయించారు. తెరాసకు జై కొట్టారు. రేపు వరంగల్, ఖమ్మంలలో కూడా అదే రిపీట్ అవుతుందని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయంటే ప్రధాన కారణం, డబుల్ బెడ్ రూం ఇండ్ల మ్యాజిక్. మొత్తానికి తన పార్టీని విజయ పథంలో నడపడానికి, మరో వైపు పేదలకు కలల ఇల్లు ఇవ్వడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే, ఆయన ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లను మించి ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు పొందుతున్నారేమో అనిపిస్తుంది.