హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుది రెండుకళ్ళ సిద్ధాంతం అని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎద్దేవా చేస్తూ ఉండటం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకోవటానికి నానా తంటాలు పడుతున్న టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశంపై విమర్శలు చేసే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న కేటీఆర్ గానీ, కవితగానీ సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును మాట మాత్రమైనా ప్రస్తావించటంలేదు. ఇంకా కవిత అయితే ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు కృషిని కాదనలేమని కూడా నిన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తే సీమాంధ్ర ఓటర్లను నొప్పించి, వారిని దూరం చేసుకున్నట్లవుతుందనే ఆలోచనతో వారు ఈ వైఖరి అనుసరించినట్లు కనబడుతోంది.
మరోవైపు ఉపఎన్నిక జరుగుతున్న నారాయణఖేడ్‌లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ యధావిధిగా తెలుగుదేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించటం విశేషం. నారాయణఖేడ్ బాధ్యతను భుజాన వేసుకున్న హరీష్ రావు నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసు దెబ్బతో హైదరాబాద్ వదిలి పరారయ్యారని అన్నారు. ఆరునెలలనుంచి చంద్రబాబు ఇక్కడ కనిపించటంలేదని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి నాయకుడు లేని పరిస్థితి ఏర్పడిందని, నాయకుడు లేని సేన మాదిరిగా వారు ఉన్నారని అన్నారు.
ఇదిలాఉంటే హైదరాబాద్‌లోని సీమాంధ్రవారిపై టీఆర్ఎస్ కురిపిస్తున్న ప్రేమపై టీడీపీ నాయకుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్ ఒక మంచి పాయింటే తీశారు. గ్రేటర్ ఎన్నికలపై ఒక టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇక్కడే పుట్టిపెరిగిన వ్యక్తి, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయిన నారా లోకేష్‌నే కేటీఆర్ గెస్ట్ అంటుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని అన్నారు. ఎన్నికల తర్వాత కాలనీల్లో, అపార్ట్మెంట్లలో ఉండే మధ్యతరగతి, సామాన్య సీమాంధ్రవారిని సర్దుకుంటారేమో అనే భయం కలుగుతోందని చెప్పారు. జాగో భాగో అని, ఆంధ్రా బిర్యానీ పేడలాగా ఉంటదని టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరిచిపోరని అన్నారు.