గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన హంగామా, తదనంతర పరిణామాలు తెలిసిందే. 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ ఇద్దరి సభ్యత్వాలను కూడా రద్దు చేశారు. అయితే, ఘటనపై కాంగ్రెస్ వాదన ఏంటంటే… సభలో తమకు నిరనస చేసే హక్కు లేదా, అదే పని పార్లమెంటులో తెరాస ఎంపీలు చేస్తున్నారు కదా అనే లాజిక్ వాళ్లు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కు అన్నట్టుగా కాంగ్రెస్ నేతల చెబుతున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను సమర్థించుకున్నారు. ఇలాంటి చర్యల్ని తాము సహించబోమని హెచ్చరించారు.
ఇలాంటి అంశాల పట్ల తాము కఠినంగా ఉంటామనీ, రాజీ లేదన్నారు. ట్యాంక్ మీద తాము నిషేధాజ్ఞలు విధించామని మిత్రులు తమను తప్పుబడుతున్నారనీ, యస్.. అలాంటి చోట నిరసనలు కచ్చితంగా నిషేధిస్తామన్నారు. సరూర్ నగర్ దగ్గర వారికి ధర్నాలకు అనుమతి ఇచ్చామన్నారు. లైవ్ టీవీలు ఉండే ఈ కాలంలో, ధర్నాలు చేసేది సరూర్ నగర్ అయితే ఏముందీ, మరో నగర్ అయితే ఏముందన్నారు. ధర్నాల ఉద్దేశం గందరగోళం సృష్టించడం కాదన్నారు. ధర్నా అంటే.. ఒక సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయడం అని మీనింగ్ చెప్పారు. అది ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా తేడా ఏముందన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలనీ, కొన్ని సందర్భాల్లో వారు అనుమతి ఇయ్యరనీ అన్నారు. అయినా మేము అక్కడే చేస్తాం, ఆపితే అప్రజాస్వామ్యం అనడం సరికాదన్నారు. అసెంబ్లీలోకి పదివేల మంది చొరబడతామంటే పర్మిషన్ ఇస్తారా అని ప్రశ్నించారు. పరిమితికి లోబడి నిరసనలు తెలిపితేనే స్వీకరిస్తామన్నారు.
కేసీఆర్ నోట ఈ మాటలు వింటుంటే కాస్త కొత్తగా అనిపిస్తోంది కదా! అసెంబ్లీలో చొరబాటు తప్పు అనీ, అనుమతులు లేకుండా నిరనసలు సరైన పద్ధతి కాదని కేసీఆర్ చెబుతుంటే ఎవరికైనా గతం గుర్తుకొస్తుంది కదా. ధర్నా అంటే అర్థమేంటో, దాన్ని ఏ రూపంలో చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతూ ఉండటం ఏదోలా అనిపిస్తోంది. ఎందుకంటే, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపిన రోజుల్లో తెరాస కూడా ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అప్పట్లో ప్రభుత్వాలు కూడా ఇలానే నిషేదాజ్ఞలు పెట్టి ఉంటాయి కదా, నిరసనలకు అనుమతులు ఇవ్వకపోవడానికి కారణాలు వేరే ఉండే ఉంటాయి కదా! ఈ సందర్భం గతంలో తెరాస పాయింటాఫ్ వ్యూ నుంచి ‘అణచివేత ధోరణి’గా కనిపించేది. ఇప్పుడు అదే తెరాస అధికారంలోకి వచ్చేసరికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’గా కనిపిస్తోంది.