తెలంగాణలో తనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడేది దెబ్బతీయాలని చూస్తున్నది రెడ్డి వర్గమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ తేల్చుకున్నారట,.. అందుకే ఆయన ఏ ఎత్తు వేసినా ఈ వర్గాన్ని బలహీనపర్చడం, వారి వ్యూహాలు విఫలం చేయడం దిశలో వున్నాయంటున్నారు సన్నిహితులు. బాగా బలహీనపడిపోయిన తెలుగుదేశం పట్ల వ్యతిరేకత అవసరం లేదని కూడా ఆయన నిర్ణారణకు వచ్చారట. పైగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గులాబీదళంపై మరీ ఎక్కువగా పోరాడటం, అందుకు వ్యయప్రయాసలు అవసరం లేదనే వైఖరి తీసుకున్నారు. ఎపిలో మళ్లీ అధికారంలోకి రావడం, తెలంగాణలో ఉనికి కాపాడుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం ఇవే నారా కుటుంబ లక్ష్యాలంటున్నారు. హెరిటేజి కోణంలో హైదరాబాదు చాలా ముఖ్యం. పైగా ఆయనకూ అయన చుట్టూ వుండేవారికి నగరంలో వ్యాపారాలు ఆస్తిపాస్తులు అపారంగా వున్నాయి. వాటిని చూసుకోకుండా వల్లమాలిన రాజకీయ యుద్ధం ఎందుకని సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. ఇక లోకేశ్ అసలు ఈవూసే వదిలేశారు. ఇదంతా కూడా కెసిఆర్ కోరుకున్నదే గాక వారిమధ్య అవగాహనలో వున్నదేనని ఇరు పార్టీల వారూ చెబుతున్న కథనం. మొన్న పరిటాల వారి పెళ్లికి కెసిఆర్‌తో కలసివెళ్లిన వారెవరూ అక్కడ ఏం జరిగింది అన్నది దీనికి ఒక నిదర్శనంగా చూపిస్తున్నారు. టిడిపిలోని చాలా మంది రెడ్లు వున్నా వారు కూడా ఏదైనా దారి వెతుక్కుంటున్నారే తప్ప అమీతుమీ తేల్చుకోవాలనే స్థితిలో లేరు. రేవంత్ రెడ్డి వంటి వారు ఇందుకు మినహాయింపులైనా వారు పార్టీని మించిన వ్యక్తిగత దూకుడుతో సాగిపోతున్నారు. రేవంత్ మాత్రమే గాక బిజెపిలోని నాగం జనార్థనరెడ్డి వంటివారు కూడా తమదగ్గరకు వచ్చేఅవకాశం వుందని ఒక సీనియర్ ప్రజాప్రతినిధి అన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికి ఐక్యత లేకపోయినా విడివిడిగా వుంటే దెబ్బతింటామని తెలుసుకోగల విజ్ఞత తమ వాళ్లకు వుందని ఒక రెడ్డి ఎంఎల్‌సి అన్నారు. గవర్నర్ గిరీ కోసం చూసి మోసపోయిన మోత్కుపల్లి నరసింహులు ఇప్పటికే తాము టిఆర్ఎస్కు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పేశారు. కనుక.. తెలంగాణ రాజకీయాల్లో అనేక విచిత్రాలు చూడొచ్చునంటున్నారు.