తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… మంత్రి వర్గ విస్తరణ మీద పెద్దగా కసరత్తు చేయడం లేదు కానీ.. అడవుల విస్తరణ, అడవులను నరికి వేస్తున్న వారిపై మాత్రం.. ఇటీవలి కాలంలో ఎక్కువగా దృష్టి పెట్టారు. రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. ఓ రకంగా అటవీ శాఖను ప్రక్షాళన చేసేశారు. అటవీ శాఖపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే వేటుతో రెండు వందల మంది ఉద్యోగులను బదిలీ చేసారు. పదకొండు మందిపై సస్పెన్షన్ వేటు వేసారు. అడవుల పునరుద్దరణ,రక్షణ కోసం “జంగిల్ బచావో, జంగిల్ బడావో” నినాదంతో పని చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పదే, పదే అటవీ నేరస్తులు, కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలంటున్నారు. వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు ప్రారంభించారు. కేసీఆర్ రాజకీయం లేకుండా ఏ పనీ చేయరని..ఓ నమ్మకం రాజకీయవర్గాల్లో ఉంది. అందుకే.. ఇప్పుడు మిషన్ అటవీ శాఖ వెనుక ఏ రాజకీయం ఉందా..అని అంతా తెగ ఆలోచిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అటవీ ప్రాంతాలలోనే టీఆర్ఎస్ ఎక్కువగా ఓడిపోయింది. మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాలో టిఆర్ఎస్ ఓడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందనేదానిపై కేసీఆర్ సమీక్ష జరిపారు. ఇందులో పోడు భూముల అంశంతో పాటు, కలప స్మగ్లర్ల వల్ల టిఆర్ఎస్ ఓటమి చవిచూసిందని తేల్చారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలే కాకుండా మరి కొన్ని చోట్ల కూడా కలప వ్యాపారులు తీవ్ర ప్రభావం చూపారని నిర్ణయించారు. కలప స్మగ్లర్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా డబ్బులు పంపిణీ చేసి ఫలితాలు తారుమారు చేసారని తేల్చి.. వారి పని పట్టడానికి సిద్ధమయ్యారంటున్నారు.
అయితే.. ఈ కలప స్మగ్లర్లలో కాంగ్రెస్ నేతలు మాత్రమే కాదు.. టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. టిఆర్ఎస్ కు చెందిన కొంత మంది నేతలకు కూడా కలప వ్యాపారంతో సంబంధాలున్నాయని అటవీ శాఖ అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో కొంత మంది టిఆర్ఎస్ నేతల అనుచరులు పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూములు ఆక్రమించారని కేసీఆర్కు లెక్కలు ఇచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు చెందిన ఒక మాజీ మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున ఫారెస్ట్ భూమి ఆక్రమించారని ప్రభుత్వానికి సమాచారం అందింది. వీటన్నింటినీ.. అడ్డుకట్ట వేయాలని కేసీఆర్ నిర్ణయించారు.