తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాటలో ఉన్నారు. మరో నాలుగురోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేసేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్ల కేబినెట్ సమావేశం జరుగుతోంది. దీన్లో ఆర్టీసీ సమస్య గురించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, పరిస్థితి చూస్తుంటే… ఏ నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వానికి కొంత గందరగోళంగానే ఉంది. ఎందుకంటే, ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు ఒకలా ఉన్నాయి, ఆర్టీసీ ఆదాయ వ్యయాల లెక్కలు మరోలా ఉన్నాయి! దీంతో కేసీఆర్ సర్కారు ఎలా స్పందిస్తుంది అనేది కీలకంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అయితే, ఏపీలో జరిగిన విలీనం ఆర్టీసీని లాభాల బాటలో పట్టించిన మోడల్ అవునో కాదో ఇంకా తేలాల్సి ఉంది. అక్కడి ఫలితాలేంటో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అయితే, ఉద్యోగులకు లాభదాయకమైన ప్రతిపాదన ఇది. దీనిపై కేసీఆర్ సర్కారు ఏమంత సుముఖంగా లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జీతాలు ఎక్కువ ఉన్నాయనీ, ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే అదనంగా జీతాలు పెంచడం ఆర్థికంగా భారమౌతుందని భావిస్తున్నారు. విలీనం కంటే విభజన చేస్తేనే మంచిదనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ మూడు జోన్లుగా ఉంది. వీటిని రెండు సంస్థలుగా మార్చాలనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. గ్రేటర్ జోన్ ని ఒక సంస్థగా, మిగతా రెండు జోన్లను మరో సంస్థగా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అలా చేసినా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇతర జిల్లాలన్నీ ఒక సంస్థగా మార్చినా నష్టాలు అలాగే ఉంటాయనీ, అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితే ఉంటుందనేది ఆర్టీసీ సంఘాల వాదన.
ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు సమాచారం. అయితే, హైదరాబాద్, కరీంనగర్ రీజియన్లను అప్పగిస్తే నిర్వహించేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయనీ, ఇతర జిల్లాల్లో రూట్లను తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు వస్తున్న పరిస్థితి లేదనీ సమాచారం! దీంతో, ఇప్పుడు ఆర్టీసీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అనేది కేసీఆర్ సర్కారుకి కొంత ఇబ్బందికరమైన అంశంగానే మారింది. ఈ సమస్యపై అధ్యయనం అంటూ ఏదైనా కమిటీ వేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒప్పుకునేందుకు ఆర్టీసీ సంఘాలు కూడా సిద్ధంగా లేవు. ఇప్పటికే సమ్మె సైరన్ మోగించేశాయి. కాబట్టి, ఇవాళ్ల జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీకి సంబంధించి ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.