తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బీజేపీ వ్యూహం కారణంగా ఆయన కార్నర్ అయిపోతున్నారు. బీజేపీ కేసీఆర్‌ను టార్గెట్ చేయకుండా ఆయన కుమార్తె, కుమారుడ్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తూండటమే దీనికి కారణం. ఎవరూ ఊహించని విధంగా కవిత పేరు.. రాష్ట్రానికి సంబంధం లేదని ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కవితనే మాస్టర్ అని వారు చెబుతున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల నిర్వహణ ఖర్చు లిక్కర్ సిండికేట్లే ఇచ్చాయని అంటున్నారు. ఏ ఆధారం లేకుండా.. కవితను ఇరికించే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా.. కవిత హస్తం ఉండే ఉంటుందని ఇప్పటికే గట్టిగా ప్రచారం జరుగుతోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తే.. కేసీఆర్‌ను లేదా.. ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్నకేటీఆర్‌ను టార్గెట్ చేస్తాయనుకుంటారు. కానీ అనూహ్యంగా కవిత పేరు తెరపైకి వచ్చింది. అయితే కేటీఆర్‌ను కూడా వదిలి పెట్టలేదని.. ఆయన కూడా నెక్ట్స్ దారిలో ఉన్నారని బీజేపీ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. తెలంగాణలో కొద్ది రోజులుగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మొన్న వాసవి గ్రూప్‌పై దాడులు చేయగా.. నిన్న ఫీనిక్స్ గ్రూప్‌ను టార్గెట్ చేశారు. వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల్ని హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహిస్తున్న ఈ సంస్థలతో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అదే నిజమైతే కేటీఆర్ ఇరుక్కుపోతారు.
జాతీయ రాజకీయాల్లో మోడీని ఢీకొట్టగలనని కేసీఆర్ అనుకున్నారు. తనపై ఈడీ దాడులు జరిగినా.. ఎదుర్కోగల శక్తి ఉందని అనుకున్నారు. అందుకే చాలా బహిరంగసభల్లో సవాళ్లు చేశారు కూడా. కానీ సీబీఐ, ఐటీ, ఈడీ ఇప్పుడు నేరుగా ఆయన మీదకు రావడం లేదు. ఆయన పిల్లలు కేటీఆర్, కవితలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. బీజేపీతో యుద్ధాన్ని కేసీఆర్ ప్రారంభించేశారు. ఇప్పుడు మధ్యలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అలా తగ్గితే.. బీజేపీ నిండా మింగేస్తుంది. పోరాడితే ఎక్కడ తేలుతారో చెప్పలేరు. కేసీఆర్‌కు ఇది క్లిష్టమైన పరిస్థితే !