బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విగ్రహ రాజకీయాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నా ఆమె తగ్గడం లేదు. బీఆర్ఎస్ ను వేలెత్తి చూపేలా పాలిటిక్స్ నడుపుతున్నా తన రాజకీయం తను చేసుకుంటూ వెళ్తున్నారు. పదేళ్లు అధికారంలో కొనసాగినా ఫూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని డిమాండ్ చేయని కవిత, అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే ఈ డిమాండ్ తో రాజకీయం చేయడం బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేసింది. ఈ విగ్రహ రాజకీయాన్ని ఆమె ఇంకా కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో కవిత కొత్త వాదన తీసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించాలన్నారు. ఇలా చేస్తేనే అంబేడ్కర్ ను గౌరవించినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోలేదు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రెస్ నోట్ విడుదల చేసి, చేతులు దులిపేసుకున్నారు అని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసేవి. ఇప్పుడు కవిత మాత్రం కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి రేవంత్ నివాళులు అర్పించడమే ఘన నివాళి అవుతుందని పేర్కొనడటం విచిత్రంగా అనిపిస్తుంది.
అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించడం ముఖ్యం..కేసీఆర్ ఏర్పాటు చేసిన 125 అడుగుల విగ్రహానికి నివాళి అర్పిస్తేనే ఘన నివాళి అని కవిత పేర్కొనడం ఆమె కుంచిత మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి, కొత్త రాజ్యాంగం తేవాలని కేసీఆర్ చేసిన డిమాండ్ ను ప్రస్తావిస్తూ..కవిత రాజకీయాన్ని తూర్పారబడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు కాదు..ముందు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి అంబేడ్కర్ ను గౌరవించడం నేర్పించాలని హితవు పలుకుతున్నారు. ఇలా కవిత ఎంచుకుంటున్న రాజకీయాలు ఆమెకు ఈమేర తోడ్పాటు అందిస్తున్నాయో కానీ, బీఆర్ఎస్ ను మాత్రం ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.