ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు… ఈ మధ్య వైకాపా, భాజపా నేతలు ముక్తకంఠంతో ప్రచారం చేస్తున్నది ఇది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ తరహా విమర్శలే చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర నిర్లక్ష్యం అనే కోణాన్ని భాజపా ప్రస్థావించదు సరే, విచిత్రంగా వైకాపా, జనసేనలు కూడా గుర్తించలేకపోతే ఎలా..! కేంద్ర నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనడానికి మరో ఉదాహరణ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ భేటీ.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరారు. ఇది కొత్త కోరికేం కాదు.. చాన్నాళ్లుగా అడుగుతున్నదే, కేంద్రం స్పందిచట్లేదు! హైకోర్టు విభజనను వెంటనే చేయాలనీ, ప్రత్యేక హైకోర్టు తెలంగాణతోపాటు ఏపీకి కూడా అవసరమని కేసీఆర్ కోరారు. ఇది కూడా కొత్త కోరికేం కాదు. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర్నుంచీ తెలంగాణ మొత్తుకుంటూ ఉన్నా దీనిపై కేంద్రం చొరవ సున్నా. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 9 జిల్లాలకు జిల్లాకి ఏడాదికి రూ. 50 కోట్లు చొప్పున ఇస్తామన్న సాయంలో నాలుగో విడత నిధులు ఇంకా రాలేదనీ, వెంటనే విడుదల చేయాలని కోరారు. 2013లో హైదరాబాద్ కి ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజయిన్ మంజూరు అయింది. కానీ, ఈ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకుంది. మంజూరైన ప్రాజెక్టును ఉపసంహించుకోవడం వల్ల కేంద్రం విశ్వసనీయత దెబ్బతింటుందనీ, కాబట్టి ఆ ప్రాజెక్టు ఇవ్వాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇక, రాష్ట్రంలో కొత్తగా కావాల్సిన రైల్వేలైన్ల అభివృద్ధి గురించి కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు. విద్యాసంస్థల ఏర్పాట్లు గురించి కూడా కేంద్రానికి విన్నవించుకున్నారు.
ఈ వినతి పత్రంలో కొన్ని కీలకాంశాలను జాగ్రత్తగా పరిశీలస్తే… తెలంగాణ విషయంలో కూడా కేంద్ర నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగేళ్లుగా తెలంగాణకు చేయాల్సినవి కేంద్రం చెయ్యలేదు. ఇదే తరహాలో ఆంధ్రా విషయంలో మరింత ఎక్కువగా నిర్లక్ష్య ధోరణితో భాజపా వ్యవహరిస్తోంది. కానీ, కేంద్ర నిర్లక్ష్యాన్ని నాలుగేళ్ల చంద్రబాబు పాలన వైఫల్యంగా మాత్రమే భాజపా, వైకాపా, జనసేనలు ఇక్కడ చూస్తున్నాయి.
ఆ లెక్కన కేసీఆర్ వినతి పత్రం చూశాక.. కేంద్ర నిర్లక్ష్యానికి గురౌతున్న తెలంగాణ విషయంలో కూడా కేసీఆర్ ఫెయిల్ అయినట్టు ఈ పార్టీలు చూస్తాయేమో..? నాలుగేళ్లపాటు కేసీఆర్ కూడా తెలంగాణకు చేసిందేం లేదని అర్థం చేసుకుంటారేమో..? ఇన్నాళ్లూ మౌనంగా ఉండి, ఇవాళ్లే ప్రధానికి ఎందుకు వినతి ఇచ్చారనే కోణంలో స్పందిస్తారేమో..? ఎందుకంటే, ఏపీలో వాస్తవ పరిస్థితులు ఈ పార్టీలకు ఇలా మాత్రమే అర్థమౌతున్నాయి. కేంద్ర నిర్లక్ష్యం అనేది ఒకటుందీ, రాజకీయ ప్రయోజనాలు లేని రాష్ట్రాలపై భాజపా సవతి తల్లి ప్రేమ చూపిస్తోందీ, నాలుగేళ్లుగా మోడీ సర్కారు నిర్లక్ష్యం కూడా ఉందనే వాస్తవం ఈ నాయకులకు అర్థం కాదేమో!