2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్నా వాటిని అమలు చేయలేకపోయారు. బడ్జెట్లలో నిధులు కేటాయించినా విడుదల చేయలేదు. అలాంటి పథకాలు ఇప్పుడు కేసీఆర్కు గుదిబండలుగా మారాయి. కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన హామీల్లో కీలకమైనది రుణమాఫీ. కాంగ్రెస్ రూ. రెండు లక్షల రుణమాఫీ హామీ ఇస్తే కేసీఆర్ రూ. లక్ష ఇచ్చారు. అయినా ప్రజలు నమ్మారు. కానీ ఇంత వరకూ ఆ రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు.
బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దానికి గాను రూ.24,738 కోట్లు అవసరం అని తేల్చారు. ఇప్పటి వరకూ రూ.3,881 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో చూపించారు. కానీ ఖర్చుచేయలేదు. సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గత బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఇంత వరకూ అమలు కాలేదు.
నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇవ్వలేదు. . ఇ క గొర్రెల పెంపకం దార్లకు యూనిట్లు ఇస్తామని వారి దగ్గర కొంత సొమ్ము చెల్లించుకున్నా ఇవ్వలేదు. ఇలాంటి పథకాలు .. ప్రజలపై నేరుగా చూపే పథకాలకు కూడా కేసీఆర్ నిధులు కేటాయించలేకపోతున్నారు. ఎన్నికల బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించడమే కాదు.. ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే కేసీఆర్కు అతి పెద్ద సవాల్ అనుకోవచ్చు.