టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నుంచి ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలు ప్రారంభించబోతున్నారు. మొదటగా ఏపీకే వెళ్తున్నారు. ఒడిషా అధికార పార్టీ బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ తో ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరిపేందుకు వెళ్లేందుకు… కేసీఆర్ ముందుగా విశాఖకు వెళ్తారు. నేరుగా భువనేశ్వర్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన ప్రత్యేకంగా విశాఖ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అధికారికంగా విశాఖలో ఉన్న స్వరూపానంద శారదా పీఠాన్ని సందర్శిస్తారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు.. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో రాజయోగ యాగం చేశారు. ఆ యాగాన్ని.. స్వరూపానందనే నిర్వహించారు.అయితే ఇదే కారణంతోనే ఆయన శారదా పీఠానికి వెళ్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కానీ ఈ స్వరూపానంద స్వామి .. జగన్ కు అధ్యాత్మిక గురువు. జగన్ కోసం.. ఇప్పటికే.. ఆయన ఆధ్వర్యంలో కొన్ని యాగాలు కూడా జరుగుతున్నాయి.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించక ముందు పలు మార్లు ఆయనతో సమావేశం అయ్యారు. జగన్ సౌలభ్యం కోసం.. అప్పుడప్పుడూ.. ఆయన ఉన్న చోటకు వెళ్తూంటారు కూడా. ఇక వైసీపీ నేతలు తరచూ స్వరూపానందతో సమావేశం అవుతూంటారు. భూమన కరణాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు తరచూ శారదాపీఠాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఆ ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందుకే అటు ఏపీలో వైసీపీకి.. తెలంగాణలో కేసీఆర్ కు ఆధ్యాత్మిక గురువుగా ఉన్న స్వరూపానందకు చెందిన శారదాపీఠంలో… ఫెడరల్ ఫ్రంట్ కు చెందిన తొలి చర్చలు కేసీఆర్ జరుబోతున్నారనే ప్రచారం ప్రారంభమయింది.
ప్రత్యేకంగా వైసీపీ తరపున ప్రతినిధులు రావాల్సిన అవసరం లేదు.. స్వరూపానందనే సందేశాన్ని చేరవేస్తారు కాబట్టి… చర్చలు ప్రారంభమయినట్లే. దేశ రాజకీయాలను మార్చే క్రమంలో.. ఏపీలోనూ అడుగు పెడతానని కేసీఆర్ కొన్నాళ్ల కిందట చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఏపీలో అడుగు పెడుతున్నారు. కాకపోతే నేరుగా కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. బహుశా శారదా పీఠం సందేశం.. వైసీపీ ఇంపుగా ఉంటే.. నేరుగా విజయవాడలో నెక్ట్స్ మీటింగ్ జరగవచ్చు. ఈ విషయంలో సానుకూల సందేశాలను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఇప్పటికే వినిపిస్తూ ఉన్నారు. కేసీఆర్ తో భేటీలు జరిపితే తప్పేమిటన్న అర్థంలో ట్వీట్లు చేస్తున్నారు. అంటే కారణం అదే కావొచ్చంటున్నారు.