తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు వెళ్లారు. డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ను కలుసుకున్నారు. అంతకుముందు కరుణానిధితో కాసేపు ముచ్చటించారు. కేసీఆర్ కి ఆయన కొన్ని పుస్తకాలు బహుమానంగా ఇచ్చారు. అనంతరం స్టాలిన్ తో ఫెడరల్ ఫ్రెంట్ విషయమై చర్చలు జరిపారు. ఆ విషయాలను మీడియాకి వివరిస్తూ.. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం తగ్గాలనీ, రాష్ట్రాలకి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాలు దేశాభివృద్ధికి సరిపోవన్నారు. దేశంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆర్థికంగా మరింత సుస్థిరంగా ఉండే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండాలనేదే తన ప్రయత్నమన్నారు.
కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నది భాజపాయేతర, కాంగ్రెసేతర ప్రత్నామ్నాయ రాజకీయ కూటమి కదా! అయితే, ఈ అంశంపైన స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎవరితో కలిసి పనిచేయాలి, ఎవర్ని కలుపుకుని ముందుకు వెళ్తాం అనేది భవిష్యత్తులో నిర్ణయించుకుంటామని, ఆ చర్చకు ఇంకా సమయం ఉందని కేసీఆర్ అన్నారు. తాను థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానని ఎప్పుడూ చెప్పలేదనీ, అది మీడియా సృష్టి మాత్రమే అన్నారు. ఈ కూటమి ఏర్పాటులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా కలుస్తాననీ, ఆయన సలహాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
కొద్దిరోజుల కిందట కర్ణాటక వెళ్లొచ్చారు. దేవెగౌడను కలిశారు. అక్కడ కూడా కేసీఆర్ కి ఇదే ప్రశ్న ఎదురైంది! భాజపా, కాంగ్రెస్ లకు సమాన దూరం పాటిస్తూ ఫెడరల్ ఫ్రెంట్ సాధ్యమా..? ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ మొదట మమతా బెనర్జీతో మాట్లాడారు. ఆ మర్నాడే ఆమె సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక, దేవెగౌడ సంగతి చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసేందుకు ఎవరు మద్దతు ఇస్తే వారివైపు మొగ్గుతారు. ఇప్పడు డీఎంకే స్టాలిన్ తో కేసీఆర్ కలిశారు. ఈయన కూడా భాజపాయేతర, కాంగ్రెసేతర అనే ఆలోచనకు మద్దతు ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే, ఆ మధ్య ప్రధాని మోడీ వచ్చి కరుణానిధిని పలకరించి వెళ్లారు. ఇంకోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకేని వదులుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మమతా బెనర్జీ, దేవెగౌడ, స్టాలిన్.. ఇలా కేసీఆర్ కలిసినవారందరూ భాజపాయేతర, కాంగ్రెసేతర అనే వాదనకు పెద్దగా మొగ్గుచూపకపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పై కేసీఆర్ కు ఉన్నంత వ్యతిరేకతను ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు ఉండాల్సిన అవసరం లేదు. సో.. ఈ నేపథ్యంలో కాంగ్రెసేతరం, భాజపాయేతరం అనే వాదనపై కేసీఆర్ మరింత స్పష్టతకు రావాలి. ఇదేదో భవిష్యత్తులో తేల్చుకోవాల్సిన అంశం కాదు. దీనిపైనే ఫెడరల్ ఫ్రెంట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.