లోక్ సభ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ కు పెద్ద కష్టంగా మారింది. నియోజకవర్గాల వారీగా సభలు పెట్టడానికి కూడా నేతలు ఇష్టపడటం లేదు. అతి కష్టం మీద చేవెళ్ల, మెదక్ నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించారు. ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ఈ అంశంపై పద్దెనిమిదో తేదీన నిర్ణయం తీసుకోనున్నారు
ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి రూ. 95 లక్షల చెక్లు ఇవ్వనున్నారు కేసీఆర్. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారాయి. మెరుగైన ఓట్లు, సీట్లు సాధించకపోతే బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి బీజేపీ రెడీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒకటి, రెండు సీట్లు కూడా రావని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సవాళ్లు చేస్తున్నారు. పార్టీ నేతలు కూడా నమ్మకం కోల్పోయి వరుసగా గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంది. ఇప్పటికే పార్టీని అనేక రకాల సమస్యలు చుట్టుముట్టాయి. కేసీఆర్ తుంటి గాయం కారణంగా ప్రచారం నిర్వహించడం కూడా సమస్యగా మారింది.