అనర్హతా వేటు పడిన యాదవరెడ్డి స్థానంలో.. భర్తీ కానున్న ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. చాలా కాలంగా ఆయన ఎమ్మెల్సీ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. గుత్తా లక్ష్యం మంత్రి పదవి. ఆ పదవి రావాలంటే.. ముందు ఎమ్మెల్సీ అవ్వాలి. కానీ సామాజిక సమీకరణాలు.. ..టీఆర్ఎస్ అధినేతకు ఉన్న ఇతర కమిట్మెంట్ల వల్ల.. గుత్తాకు.. ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. త్వరలో.. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న అంచనాల నేపధ్యంలో.. ఇప్పుడు.. అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఖరారు చేయడంతో.. గుత్తా సుఖేందర్ రెడ్డికి.. మంత్రి పదవి ఆశలు చిగురించాయి.
కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఆ తర్వాత .. టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీ నేతగా బాగానే పోరాడారు. అనేక అంశాలపై కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. గుత్తా వేసిన పిటిషన్ ఆధారంగానే… అప్పట్లో కేసీఆర్.. పార్లమెంటరీ సెక్రటరీలుగా.,. కేబినెట్ హోదాలో నియమించిన ఎమ్మెల్యేల పదవులను తీసేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పుడే ఆయనకు.. కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో.. మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో… కోదాడ లేదా.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేయమని ఆఫర్ ఇచ్చినప్పటికీ.. గుత్తా వెనుకడుగు వేశారు. తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
ఇప్పుడు.. గుత్తాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందో లేదో మాత్రం.. చెప్పడం కష్టమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. తనకు కేసీఆర్ హామీ ఇచ్చారని.. గుత్తా సుఖేందర్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఆయన ఆశాభావంతో ఉన్నారు. మంత్రి కావాలన్నదే.. గుత్తా సుఖేందర్ రెడ్డి లక్ష్యం. మరి అది నెరవేరుతుందో.. లేదో.. త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.