వరుస బహిరంగ సమావేశాలతో ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ దూసుకుపోతున్నారు. సోనియాగాంధీ ఇటీవల తెలంగాణ లో బహిరంగ సభలో మాట్లాడుతూ, కన్నతల్లి తన బిడ్డలు బాధపడుతుండటం చూసి తల్లడిల్లుతున్న విధంగా తాను తెలంగాణ ను చూసి తాను తల్లడిల్లుతున్నానని, ఇక్కడి ప్రజలు చాలా బాధలు పడుతున్నారని కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై విరుచుకు పడ్డారు కెసిఆర్.
ఈరోజు బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ , సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సోనియమ్మ ఎందుకని తల్లడిల్లుతోంది అని ప్రశ్నించిన కెసిఆర్, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతి నెల ఆమెకు సూట్ కేసుల మీద సూట్ కేసులు అందేవని, ఇప్పుడు అవి అందడం లేదనే సోనియమ్మ బాధ అని కేసీఆర్ వివరించారు. ఆమె బాధంతా నెలనెలా అందాల్సిన మామూళ్లు అందకపోవడం గురించేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఉన్నట్టుగా 24 గంటల కరెంటు ఉండదని, మళ్లీ కరెంటు కోతలు మొదలవుతాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేసిన తెలంగాణ ని, కాంగ్రెస్ చేతిలో పెట్టవద్దని, అలా చేస్తే ” దాచి దాచి దయ్యాలకి అప్పగించినట్లు అవుతుంది” అంటూ హెచ్చరించారు కెసిఆర్.