ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు… సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ పీఎం అయ్యాక అనేక నినాదాలు చెప్పారని గుర్తు చేసిన కేసీఆర్ అందులో ఏ ఒక్కటైనా నిజమైందా..? అని ప్రశ్నించారు.
అదే సమయంలో తెలంగాణలో 14 – 15 సీట్లు గెలుస్తామని బీరాలు పలుకుతోన్న కాంగ్రెస్ గాలి తీశారు కేసీఆర్. అదంతా గ్యాస్ అని అని విమర్శించారు. ఆ పార్టీ నిజామాబాద్ లో 20 శాతం ఓట్ల తేడాతో వెనకబడిందని గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. నిజామాబాద్లో పోయినసారి బీజేపీ ఎంపీని గెలిపించారు.. ఏమన్న లాభం జరిగిందా..? ఏకాణా పని కూడా కాలేదు కదా..?మరెందుకు బీజేపీకి ఒటేయ్యాలన్నారు.
తెలంగాణ దళం, బలం , గళం బీఆర్ఎస్సేనని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేయగానే, పిడికిలి బిగించగానే రైతు బంధు స్టార్ట్ చేశారన్నారు. మిగతా హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ కు బలం ఉండాలని, నిజామాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలన్నారు.
తెలంగాణలో గుజరాత్ మోడల్ ప్రచారంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. గుజరాత్ మోడల్ అంటే గోద్రా అల్లర్లు… మత సామరస్యంతో శాంతికి నిలయంగా ఉండే తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మోడల్ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. బీజేపీపై అవిశ్రాంతంగా పోరాడినందుకే తనపై కక్ష గట్టి తన కూతురు కవితను అరెస్ట్ చేశారన్నారు కేసీఆర్. అయినా మోడీకి లొంగనని, ఎత్తిన పిడికిలి డించనని.. తెలంగాణ కోసం చివరి వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.