తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలకి దూరదృష్టి, సమగ్ర ప్రణాళికతో పనిచేయడం చేతకాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు ఎప్పుడూ డిల్లీలోని తమ అధిష్టానం ఆదేశాలకు, ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే పనిచేయడం అలవాటయినందున, ఎప్పుడూ నిజమైన నాయకులుగా పని చేయలేకపోయారని అన్నారు. ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ నేతలు ఈ రాష్ట్రంలో ఓ మాటా ఆ రాష్ట్రంలో ఇంకో మాట మాట్లాడుతుంటారు. వారికి సమగ్రమైన విధానమేదీ లేదని చెప్పడానికి అదే నిదర్శనం. జాతీయ పార్టీ అయ్యుండి ఒక సమగ్రమైన విధానం, ఆలోచన లేకుండానే దేశాన్ని రాష్ట్రాన్ని పాలించారు. అంతకు ముందు రాష్ట్రాన్ని పాలించిన తెదేపా ప్రభుత్వానికి కూడా హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి పట్ల సమగ్రమైన అవగాహన లేకపోవడం వలననే, నిర్దిష్టమైన ప్రణాళికలు రచించుకోలేకపోయింది. అందుకే నేడు హైదరబాద్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. హైదరాబాద్, తెలంగాణా సమస్యలను, అవసరాలపై చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతే అందుకు తగ్గ ప్రణాళికలను మా ప్రభుత్వం రూపొందించుకొని ఆ ప్రకారమే ముందుకు సాగుతోంది,” అని చెప్పారు.
తెలంగాణా ప్రాజెక్టులను ఏపిలో కొందరు వ్యతిరేకించడంపై కేసీఆర్ చాలా నిర్మొహమాటంగానే తన అభిప్రాయాలను కుండ బ్రద్దలు కొట్టినట్లుగా చెప్పారు. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి పరోక్షంగా ప్రయత్నిస్తుంటే, మరో పార్టీ (వైకాపా) నేరుగానే వ్యతిరేకించింది.ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఆ పాట పడుతుంటుంది. తెలంగాణా తెదేపా నేతలు దద్దమ్మలు. మహానాడులో తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వాళ్ళ చేతే చంద్రబాబు తీర్మానాలు చేయించారు. కానీ ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎవరూ కూడా ప్రాజెక్టులను ఆపలేరు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి నేతలు మాతో ఊరికే గొడవలు పెట్టుకోవడం వలన ఆ రాష్ట్రానికే నష్టం కలుగుతుందని గుర్తుంచుకోవాలి. గత 47 ఏళ్ల రికార్డుల ప్రకారం చూసినట్లయితే ధవళేశ్వరం వద్ద ఏడాదికి సగటున 2651 టి.ఎం.సి.ల నీళ్ళు సముద్రంలో కలిసినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలోకి సగటున 1204టి.ఎం.సి.ల నీళ్ళు వస్తున్నాయి. ఆ లెక్కన కృష్ణా గోదావరి రెండు నదులలో కలిపి సుమారు 4000 టి.ఎం.సి.ల నీళ్ళు వస్తున్నట్లు లెక్క. దానిలో మేము తీసుకొనే నీళ్ళు ఏ పాటివి? మేము ఎన్ని నీళ్ళు తీసుకొన్నా రాయలసీమకి అవసరమైనన్ని నీళ్ళు అందుతాయి. ధవళేశ్వరం నుంచి తడ వరకు నీళ్ళు పారించుకొనే అవకాశం కూడా ఉంది. కనుక మాతో నీళ్ళ కోసం పేచీలు పెట్టుకొని నష్టపోవడం కంటే, ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు పూర్తిగా ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తే అందరికీ మంచిది,” అని కేసీఆర్ అన్నారు. మరి కాంగ్రెస్, తెదేపా, వైకాపాల నేతలు ఏమంటారో?