ప్రెవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తమ పరిధిలో ఎవ్వరూ వేలు పెట్టకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో… కేసీఆర్ తమ సర్కారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎంత కఠినంగా వ్యవహరించగలదో నిరూపించడానికి కత్తి దూస్తున్నారు. ప్రెవేటు విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని ఆయన నిరూపిస్తున్నారు. ప్రభుత్వానికి వారు సహాయ నిరాకరణ చేస్తే గనుక.. ప్రత్యామ్నాయాలు చూసుకుంటామే తప్ప.. వారి ఒత్తిడికి, బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గేది లేదని కేసీఆర్ నిరూపిస్తున్నారు.
ప్రెవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం పోలీసులతో తనిఖీలు నిర్వహింపజేయడం అనే వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో తీవ్రస్థాయిలో వివాదం రేగుతోంది. ప్రభుత్వం తనిఖీలు నిర్వహింపజేయడం సరికాదంటూ ప్రెవేటు కళాశాలల వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌బెంచ్ ప్రెవేటు కళాశాలల్లో ప్రభుత్వ జోక్యాన్ని తప్పు పట్టింది.
దానికితోడు ఈ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. ఎంసెట్ పరీక్షకు సహకరించేది లేదని ప్రెవేటు కాలేజీలు మంకుపట్టు పట్టాయి. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు కూడా కేసీఆర్ తలొగ్గలేదు. ప్రస్తుతానికి ఎంసెట్‌ను వాయిదా వేసి.. భవిష్యత్తులో కూడా నిర్వహించే అన్ని ప్రభుత్వ పరీక్షలకు కేవలం ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే జరగాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాత్రమే నిర్వహించాలని కేసీఆర్ వెంటనే ప్రత్యామ్నాయ నిర్ణయం తీసేసుకున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం కూడా పూర్తి మద్దతు ప్రకటించింది.
కేసీఆర్ ఈ విషయంలో చాలా దృఢమైన వైఖరినే అనుసరిస్తున్నారు. గురువారం నాటి సింగిల్‌బెంచ్ తీర్పుపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ఆ పిటిషన్‌ను బెంచ్ విచారించి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రెవేటు కాలేజీలలో పోలీసులతో ప్రభుత్వ తనిఖీలకు అనుమతి ఇచ్చింది. నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పు కాదనికోర్టు చెప్పడం విశేషం.
ప్రెవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, నిబంధనలు విరుద్ధంగా అనేక అరాచకాలకు పాల్పడుతుండడం, అడ్డగోలు ఆర్జనలతో చెలరేగుతుండడం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఇలాంటి పోకడలకు కత్తెర వేయడానికి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.