తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఇంతవరకు కేసీఆర్ ఎక్కడా స్పందించలేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను చూసేందుకూ వెళ్లలేదు. ఫైనల్ గా బీఆర్ఎస్ నేతల మీటింగ్ కేసీఆర్ కవిత అరెస్ట్, లిక్కర్ స్కాంపై స్పందించారు.
బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ 104మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు కుట్ర చేశారని… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేసేంత వరకు వెళ్లామని, అందుకు ప్రతీకారంగానే కవితను అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తదేనని… బీఎల్ సంతోష్ పై కేసు లేకుంటే కవితపై కేసే లేదన్నారు.
నిజానికి కొంతకాలంగా ఢిల్లీ లిక్కర్ కేసు, కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నా…ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతుంది బీఆర్ఎస్. చివరకు కవిత పుస్తెలతాడు కావాలని కోరితే… జైల్లో కూడా బంగారు ఆభరణాలు కావాలని అడిగింది అంటూ ప్రచారం చేశారు. దానికి కూడా బీఆర్ఎస్ జవాబు చెప్పుకోలేకపోయింది.
కానీ, ఫైనల్ గా ఇది ప్రతీకార అరెస్ట్ అని… బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ కొత్త దారి చూపినట్లు స్పష్టంగా కనపడుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ముందే ఢిల్లీ లిక్కర్ స్కాం బయటకు వచ్చింది. కానీ దానికి దీనికి కేసీఆర్ ముడిపెట్టి మాట్లాడుతున్నారంటేనే కేసీఆర్ అల్లిన స్టోరీ అని అర్థం చేసుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు బీజేపీ నేతలు.