దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపుతో బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. గ్రేటర్లో దుమ్ము దులిపేస్తామని అంటున్నారు. ఒక్క విజయంతో బీజేపీ నేతల హడావుడి పెరిగిపోవడంతో.. వారి గాలి తీయాలని టీఆర్ఎస్ ముఖ్యులు నిర్ణయించుకున్నారు. గ్రేటర్ ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే.. వారు అంతగా రెచ్చిపోతూంటారని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మంత్రులందరితో సమావేశం అవుతున్నారు. గ్రేటర్ ప్లాన్ వివరించి.. ప్రత్యేకంగా అందరికీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
నిజానికి గ్రేటర్ ఎన్నికలను ఈ నెలాఖరులోనే నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. పదమూడో తేదీన ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమేనని ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే.. వరద సాయం పంపిణీలో అవకతవకల కారణంగా టీఆర్ఎస్ హైకమాండ్ కాస్త వెనుకడుగు వేసిందన్న ప్రచారం జరిగింది. జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించాలన్న యోచన చేస్తోందని అనుకున్నారు. కానీ.. దుబ్బాక ఫలితం తర్వాత రాజకీయం మారింది. టీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిందనే ప్రచారం ఊపందుకుంది. ఇతర పార్టీలు మీడియా, సోషల్ మీడియాల్లో అదే ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు.
కేటీఆర్ ఇప్పటికే హైదరాబాద్‌లో తనదైన శైలిలో పర్యటిస్తున్నరు. ఏ మూలకు వెళ్లినా .. ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతల్ని వివరిస్తూ.. ప్రచార హోర్డింగ్‌లు కూడా పెట్టారు. ఎన్నికలకు టీఆర్ఎస్ దాదాపుగా సిద్ధమయింది. కేసీఆర్ దిశానిర్దేశం తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాలం .. వాయిదా వేసే ఉద్దేశం మాత్రం గులాబీ బాస్‌కు లేదని.. క్లారిటీ వస్తోంది.