తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిగతా ఉపఎన్నికల కన్నా హుజూరాబాద్ ప్రత్యేకమైనది. ఆషామాషీగా గెలవడానికిచాన్స్ లేదు. అందుకే… అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రత్యేకంగా జిల్లా చేయడం దగ్గర్నుంచి ఇంకా చాలా ఆలోచనలు చేస్తున్నారు. అదే సమయంలో పాత ఫార్ములాను వదులుకోవడం లేదు. పాత ఫార్ములా అంటే.. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి వందల కోట్ల పనులు మంజూరు చేయడం. గతంలో దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల ఉపఎన్నికల సమయంలో కేసీఆర్ వందల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశారు.
ఉపఎన్నికలు ముగిసే వరకూ వాటి గురించి విపరీతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అవి అమలవుతున్నాయా.. లేదా అనేదాని గురించి పట్టించుకునేవారు లేరు. ఎవరూ అడిగే పరిస్థితి కూడాలేదు. ఎన్నికలకు ముందు మాత్రం కేసీఆర్… తానే వస్తానని.. కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని చెబుతారు. అలా పదుల సార్లు చెప్పి ఉంటారు. ఇప్పుడా డైలాగ్ మళ్లీ హుజూరాబాద్‌లో వినిపించనుంది. అయితే.. ప్రజలు నమ్ముతారో లేదో నన్న డౌట్ ఉందేమో కానీ.. ఉపఎన్నికలు జరగబోయేలోపు కొన్ని పనులు చేయాలని సంకల్పించారు. అందులోభాగంగా హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు వెంటనే మంజూరుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాగునీటి కోసం 10 కోట్లు… వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చేశారు.
ఇక తాను హుజూరాబాద్‌లోనే ఉంటానని ప్రకటించిన మంత్రి గంగుల కమలాకర్.. నలభై ఐదు రోజుల్లో ఆ పనులన్నీ పూర్తి చేస్తామని సవాల్ చేశారు. ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. ఉపఎన్నిక ముగిసేవరకూ హుజూరాబాద్‌లో ప్రభుత్వ యంత్రాంగం అంతా పని చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆరు నెలల్లో అక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగితే.. అన్ని జరిగినట్లు.. ఆ తర్వాత మాత్రం పట్టించుకునేవారండరని..హుజూరాబాద్ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ హడావుడితో.. ఈటలపై ప్రజల్లో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందన్న చర్చ ఇప్పటికే ప్రారంభమయింది.