2019 పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీపై పోరాటానికి చంద్రబాబు ఏం చేశారో ఇప్పుడు కేసీఆర్ కూడా వరుసగా అదే చేస్తున్నారు. తాజాగా సీబీఐకి జనరల్ కన్సెంట్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణమైనా ఉత్తర్వులు రానున్నాయి. ఈ విషయంలో ఆయన బీహార్లో ఇప్పటికే సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ను రద్దు చేయాలన్నారు. తెలంగాణలో సీబీఐ విరుచుకుపడే అవకాశాలున్నాయని.. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై లిక్కర్ స్కాం కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఇలాంటి ప్రకటనలు చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు.
చట్టాల ప్రకారం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే విచారణ జరుగుతుంది. ఓ రాష్ట్రంలో సొంతంగా సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించు. వారిపై సీబీఐ .. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా దాడులు చేయవచ్చు. అయితే ఇలా చేయడానికి కూడా సీబీఐకి అన్ని ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇస్తూనే ఉంటుంది. కానీ సీబీఐ రాజకీయ అస్త్రంగా మారిన తరవాత విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నారు.
గతంలో చంద్రబాబునాయుడు సీబీఐకి ఇచ్చిన ఈ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసి చాలా మందికి మార్గం చూపారు. అప్పట్లో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ ఈ నిర్ణయంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తప్పు చేయకపోతే భయమెందుకన్నట్లుగా బహిరంగసభల్లో మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్కు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన అన్ని రాష్ట్రాలూ అదే చేయాలని అంటున్నారు. బీజేపీ, మోదీపై పోరాడగలమని గట్టిగా అనుకుంటున్న ప్రాంతీయపార్టీల నేతలు .. అదీ కూడా సీఎంలుగా ఉన్న నేతలు.. ఒకే విధంగా ముందుకెళ్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో ?