భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని… ఆ పార్టీ రైతుల్ని మోసం చేస్తోందని టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్ మినహా అగ్రనేతలందరూ ధర్నాలు చేస్తున్నారు. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలోధర్నా జరుగుతుంది. అప్పుడు కొన్ని వేల మందిని తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్… కేంద్రంపై ధర్నాలు చేయడం అదీ కూడా నిన్నామొన్నటి వరకూ రణం లేదు.. రాజీ లేదు అని చెప్పుకున్న పార్టీపై పోరాటం ప్రారంభించడం.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన రాజకీయం తరహాలోనే ఉంది.
నాలుగేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంలో ఉండి.. తర్వాత బయటకు వచ్చేసి.. బీజేపీపై చంద్రబాబు చేసిన రాజకీయ పోరాటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఢిల్లీకి వెళ్లి కూడా విభజన హామీలు అమలు చేయడం లేదని ధర్నాలు చేశారు. ప్రధాని ఇంటి ముట్టడి వంటివికూడా చేశారు. కానీ ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. దారుణమైన పరాజయాన్ని కానుకగా ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే తరహాలో బీజేపీపై పోరు ప్రకటించారు. ఢిల్లీలో అగ్గి పెడతాం అంటున్నారు. కానీ ప్రజల్లోమాత్రం ఏ మూలో సందేహాలు ఉండనే ఉన్నాయి.
చంద్రబాబు చేసినట్లుగా ముందు ముందుకేసీఆర్ కలసి వచ్చే పార్టీలతో పోరాటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ కలసి వచ్చే పార్టీలు ధర్డ్ ఫ్రంటా లేకపోతే.. మరో ఫ్రంటా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటం అనేది ఖాయం. ఈ విషయం దూకుడుగా వెళ్తే ఇక చంద్రబాబు చేసిన రాజకీయమే చేసినట్లవుతుంది. ఎన్నికల్లో చంద్రబాబును మించి భిన్నమైన ఫలితాలు సాధిస్తే.. చరిత్రను తిరగరాసినట్లే అవుతుంది. లేకపోతే ఫెయిల్డ్ వ్యూహాన్ని నమ్ముకుని నష్టపోయినట్లుగా మిగిలిపోతారు. ఈ విషయంలో బీజేపీ కేసీఆర్ను మరింత రెచ్చగొట్టేందుకే ప్రయత్నిస్తోంది.