హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు తమ అధినేతను పొగుడుతూ ఇప్పుడు ఈ ఈక్వేషన్‌ను కోట్ చేస్తున్నారు. అదెలాగంటే కేసీఆర్‌లో ‘సీ’ అంటే చంద్రబాబు, ‘ఆర్’ అంటే రాజశేఖర్‌రెడ్డి అంటున్నారు. ఒకవైపు చంద్రబాబు వ్యూహాలను, మరోవైపు ‘లివ్ అండ్ లెట్ లివ్’ అనే వైఎస్ పాలసీని కేసీఆర్ ఔపోశన పట్టారనీ, ఆ రెండింటినీ కలిపి తనదైన శైలిలో సాగిపోతున్నారని చెబుతున్నారు.
ఆ ఇద్దరు నేతలను కలిపితే ఎంత బలం ఉంటుందో, కేసీఆర్‌కు అంత బలముందని అంటున్నారు. అన్ని ఎన్నికలలో అప్రతిహత విజయపరంపరను కొనసాగించటానికి, 20 నెలలుగా అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత తలెత్తకపోవటానికి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అయస్కాంతంలా ఆకర్షించటానికి, పార్టీలో అసమ్మతి అనేది అణుమాత్రమైనా వ్యక్తం కాకపోవటానికి, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉంటున్నా పాలన సాఫీగా సాగటానికి అదే కారణమని చెబుతున్నారు. బాగానే ఉంది ఈక్వేషన్! అంటే కేసీఆర్ వాళ్ళిద్దరినీ మించిపోతారన్నమాట! చూద్దాం!