గతంలో ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎంగా పదవి ఇచ్చిన కేసీఆర్ ఈ సారి మరో ఎంపీని ఎమ్మెల్సీ చేశారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బండా ప్రకాష్ 2018లో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయనకు 2024 వరకు పదవి కాలం ఉంది. ఇప్పుడే ఎమ్మెల్సీగా తీసుకోవడంతో ఆయన స్థానంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పదవి కాలం జనవరిలో ముగియనుంది.
మొత్తం ఆరుగుర్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యీ అభ్యర్థులుగా కేసీఆర్ ఖరారు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి మిగతా ఐదుగురు. ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారు ఉండగా.. ఒకరు వెలమ, మరొకరు ముదిరాజు.. ఇంకొకరు దళిత సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు.
ఎన్నికలకు ప్రిపేరయ్యే ముందు కుటుంబ రాజకీయాలను చక్కదిద్దాలని కేసీఆర్ అనుకున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఎన్నికల టీంను రెడీ చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను బట్టి అంచనా వేస్తున్నారు. కేటీఆర్, కవిత ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే సమస్యలు వస్తాయన్న కారణంగాకవితను ఢిల్లీకి పంపాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతు్నారు.