కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ ఆయన ఈ సీఎం కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్రమోదీ ఉండి ఉండవచ్చునేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ప్రకటనల వెనుక మోదీ ఉన్నారేమో అనిపిస్తోంది. కేసీఆర్ మాటల అలానే ఉన్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక వర్గం ఈ వాదనను నమ్ముతోంది. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తో గవర్నర్ నరసింహన్ తో మొదటినుంచి కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులతో కొన్ని వాగ్వాదాలు ఉన్నప్పటికీ, కేంద్ర నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అలాంటి కెసిఆర్ ఉన్నట్టుండి మూడో ఫ్రంట్ ప్రకటించడం కలకలం సృష్టించింది. అయితే ఈ విశ్లేషకుల వాదన ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య అగాధం రోజురోజుకీ పెరుగుతోంది. ఏదో ఒక రోజు కచ్చితంగా ఈ బంధం తెగి పోతుంది . అయితే ఒకవేళ బిజెపి పొమ్మనకుండా పొగ పెట్టి తెలుగు దేశం పార్టీని బయటికి పంపిస్తే కచ్చితంగా చంద్రబాబు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి అవకాశం చంద్రబాబు ఇవ్వకుండా కెసిఆర్ తో మోడీ అమిత్ షా ద్వయం మూడో ఫ్రంట్ పెట్టించిందని విశ్లేషకుల వాదన. అలాగే ఇంకొక వాదన ఏమిటంటే ఈ మూడవ ఫ్రంట్ కేవలం బీజేపీకి అనుకూలత లేనటువంటి రాష్ట్రాల్లో యేర్పాటు చేసి కాంగ్రెసు కి గండికొట్టేలా మోడీ అమిత్ షా ప్లాన్ చేశారు అని కూడా ఇదే విశ్లేషకులు వాదన.
ఈ వాదన ఎంత వరకూ నిజమనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. కానీ ఈ మూడవ ఫ్రంట్ గురించి తెలుగుదేశం వర్గాలు స్పందించకపోవడం చూస్తుంటే కెసిఆర్ మాత్రం ఈ మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేసే ముందు చంద్రబాబును సంప్రదించలేదని అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనా అసలు ఈ థర్డ్ ఫ్రంటే ఏర్పడుతుందా లేక మాటలకే పరిమితం అవుతుందా అన్నది తెలియాలంటే మరి కొద్ది నెలలు ఆగాలి