ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినప్పుడు ప్రచారం ఎక్కువగా రావాలంటే కొన్ని పద్ధతులు, టెక్నిక్కులు ఉంటాయి. తెలంగాణ రైతాంగానికి ఎరువులు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ నాటకీయంగా, ఆకస్మికంగా ప్రకటించారు. ఇది విప్లవాత్మకమని, ప్రతిపక్షాలను నివ్వెరపోయేట్లు చేసిందని మీడియాలో కథనాలు హోరెత్తించారు. వాస్తవానికి ఆయన నాలుగు వేల రూపాయలు నగదు బదిలీ చేయడం తప్ప ఎరువుల సరఫరాతో, అవసరాలతో ప్రత్యక్ష సంబంధం ఏమీ ప్రకటించలేదు. నాలుగేళ్ళపాటు రూ.4వేల కోట్ల చొప్పున రుణమాఫీ పథకం అయిపోయిందని చెప్పారుగనుక, ఐదవ ఏట అంటే ఎన్నికల సంవత్సరంలో ఆ మొత్తాన్ని ఎరువుల పేరిట రైతులకు బదలాయించటం ఈ ప్రకటన సారాంశమని నేను మొదట్లోనే చెప్పాను. రాశాను కూడా. ప్రపంచబ్యాంకు సిద్ధాంతాల ప్రకారం సంక్షేమ భారాలు తగ్గించుకోవడానికి నగదు బదిలీ ఉత్తమ మార్గం. ఇది 2009లో కెసిఆర్ టిడిపితో కలిసి పోటీ చేసినప్పుడు కూడా ప్రచారం చేసిన పథకాల వంటిదే. నిజామాబాద్ సమీక్షలో ఒక్కసారిగా ఉచిత ఎరువులు ప్రకటన చేయటం వ్యూహాత్మక చర్య మాత్రమే. వివరాలు కావాలి గనుక వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని అన్నప్పటికీ వాస్తవంలో ఎన్నికల సందర్భం అందరికీ తెలిసిందే. పైగా ఈ మొత్తం అందించేందుకు, నిర్వహించేందుకు గ్రామాల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంటే వీటిలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే ఉంటారన్నది స్పష్టం. ఆ విధంగా కింద నుంచి పై వరకు ఒక పెద్ద వ్యవస్థ గ్రామాల్లో ఏర్పడుతుంది. అలాగే ఈ సహాయం పెద్ద రైతులకు కూడా అందించటం జరుగుతుందని చెప్పినమాట కూడా కెసిఆర్ ప్రకటనతో నిజమని తేలింది. కాకపోతే తెలంగాణలో వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయన ఇచ్చిన వివరాలు సమర్థనకే పనికివస్తాయి. సంఖ్య ఏదైనా, ఎంతైనా సంక్షేమ పథకాలకు ఆర్థిక కొలబద్దలు ఉండాలి. పైగా ఈ సందర్భంగా ప్లీనరీలో మాట్లాడిన కెసిఆర్ రైతాంగానికి కూలీలు దొరకడం లేదని ఆవేదన వెలిబుచ్చడం సంపన్న, అధికాదాయ వర్గాల మాటలనే తలపిస్తుంది. భూమిలేని రైతులు, వ్యవసాయ కార్మికుల కోణంలో అయితే ఉపాధి హామీ పథకంపై వ్యాఖ్యలకు అవకాశం ఉండేది కాదు. వృత్తిదారులకు ఆధునిక క్షౌరశాలలు, వాషింగ్ మెషిన్లు వంటివి ఇస్తామన్నది కూడా ఈ తరహాలోనే ఉభయతారకంగా చేసిన ఆలోచన. మొత్తంపైన వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ గ్రామసీమల్లో ప్రతివారికీ ప్రభుత్వం సహాయ పడిందనే ప్రచారం రావాలన్నది ముఖ్యమంత్రి కీలక భావనగా అర్థమవుతున్నది. సంక్షేమ పథకాలు స్వాగతించినా, పేరుకుపోయిన మౌలిక సమస్యలకు వ్యవస్థాగత అంశాలకు అవి పరిష్కారం చూపలేవని అనుభవం చెబుతున్న సత్యం. ప్రత్యేకించి తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి చిట్కాలు దాన్ని ఏమాత్రం తగ్గించలేవు. ప్రస్తుతానికి మాత్రం నగదు బదిలీ అటు బదిలీ ఇటు జరుగుతుందని టిఆర్ఎస్ ఆశ.