ఇప్పటివరకూ పాలనా సంబంధమైన విషయాల్లో కొంత హడావుడి చేసి తర్వాత నెమ్మదించే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు రాజకీయ విషయాల్లోనూ అదే పద్దతి మొదలుపెట్టారు.వివిధ రకాల భవనాలు కార్యక్రమాలపై ఆయన చేసిన ప్రకటనల ప్రకారమైతే ఇప్పటికి అనేకం పూర్తి అయి వుండాల్సింది. కాని వాటి గురించి మాట్లాడుతున్నదే లేదు. రేపే పిలిపించి మీతో చర్చిస్తామన్న అనేక అంశాలు వెనక్కుపోయాయి. ఇదే కోవలో ఇప్పుడు ఆయన ఫెడరల్ ఫ్రంట్ హడావుడి కూడాకాస్త మందగమనంలో పడింది. ఏప్రిల్ 27న జరిగే టిఆర్ఎస్ ప్లీనరీకి మిత్ర పక్షాల నేతలను ఆహ్వానిస్తామని మొదట ప్రతిపాదించారు. కొంత ప్రయత్నం కూడా జరిగింది. కెసిఆర్ కొల్కతా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలసి వచ్చారు. కాంగ్రెస్‌తో కలసి వెళ్లాలనే ఆమె ఆలోచన కెసిఆర్‌కు భిన్నమైందైనా చర్చంటూ జరిపారు. తర్వాత ఆయన ఢిల్లీ వెళతామని కార్యక్రమం రూపొందించుకున్నారు గాని ఎందుకో వాయిదా వేసుకున్నారు.సిపిఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 18 నుంచి హైదరాబాదులోజరుగుతున్నాయి గనక ప్రభుత్వ సహాయ సహకారాలు అభ్యర్థించడానికి సిపిఎం నేతలు రాఘవులు వీరభద్రం ఆయనను కలిశారు. అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ చర్చకు రాగా విధివిధానాలు ఖరారు చేసుకోవాలని సూచించారు. ఆయన కూడా అదే పనిలో వున్మామన్నారు. ఇది నిజానికి రాజకీయ సంబంధమైన భేటీ కాదు గాని సిపిఎం నాయకులు మొదటిసారి కలిశారు గనక ఈ కథనాలన్నీ వచ్చాయి.
మరోవైపున మండలిలో విప్, కెసిఆర్ సన్నిహితుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఫెడరల్ ఫ్రంట్ వ్యూహానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 27 ప్లీనరీకి ఇతర పార్టీల నాయకులను పిలవడం లేదని తేల్చిచెప్పారు. అక్టోబరు నెల నాటికి దేశంలో ఎన్నికల వాతావరణం స్పష్టమవుతుంది గనక అప్పుడే మళ్లీ ఫ్రంట్ ప్రయత్నాలు పర్యటనలు భేటీలు నిర్వహించడం మంచిదని కెసిఆర్ నిర్ణయానికి వచ్చారట. లోగడ ఏదో ప్రత్యేక పరిస్థితిలో చర్చ మరోవైపు మళ్లించేందుకు హఠాత్తుగా జాతీయ ప్రత్యామ్నాయం చర్చ అవసరమైంది. దేశ్‌కీ నేత అంటూ నినాదాలు వినిపించాయి. ఆ అవసరం తీరింది.హడావుడి తగ్గింది. అంతే. దటీజ్ కేసీఆర్.