టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈటల రాజేందర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవాలని అనుకోవడం లేదు. ఇరవై ఏళ్ల నుంచి ఈటల రాజేందర్ పాతుకుపోయిన నియోజకవర్గం కావడంతో ఆయనను ఓడించడానికి చాలా ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది. ఈటల అనుచరుల్ని ఆయనకు దూరం చేయడంతోనే అనుకున్న లక్ష్యం సాధ్యం కాదు.. అంతకు మించి.. ప్రజల్ని భావోద్వేగానికి గురి చేయాలి. అందుకే కేసీఆర్ ప్రజలందరికీ సంతృప్తి పరిచే నిర్ణయం తీసుకోవాలనుకుంంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ నిర్ణయమే.. హుజూరాబాద్ మొత్తాన్ని జిల్లాగా ప్రకటించడం.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిస్థితి వేగంగా మారిపోయాయి. ముఫ్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ.., ఇంకా ఇంకా డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. అందుకే.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు కొత్త జిల్లాల హామీలను ఇచ్చి.. నెరవేర్చారు కేసీఆర్. ఇటీవలే వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది. ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు కొత్త జిల్లాను ప్రకటించడం ద్వారా.. కేసీఆర్.. ఈటలను మాస్టర్ స్ట్రోక్ కొట్టాలనుకుంటున్నారు. అదే సమయంలో.. జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలనుకుంటున్నారు.
పీవీ నరసింహరావును తెలంగాణ సర్కార్ ఇటీవలి కాలంలో ఎక్కువగా గౌరవం ఇస్తోంది. ఆయన శత జయంతి ఉత్సవాలను భారీగా నిర్వహిస్తోంది. అదే సమయంలో… ఆయన కుమార్తెను ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించారు కూడా. ఈ క్రమంలో పీవీ స్వగ్రామం.. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంటుంది కాబట్టి… హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించి.. దానికి పీవీ పేరు పెడితే… ఆయన అభిమానులందర్నీ ఆకర్షించినట్లు అవుతుందని అంచనా వేస్తన్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశీలన కూడా పూర్తయిందని.. చెబుతున్నారు. అంటే ఈటలను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నంలో కొత్త జిల్లా కూడా ఏర్పడబోతోందన్నమాట.