ఖమ్మం బీఆర్ఎస్ నేతల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పుడుతోంది. ఎవరేం మాట్లాడినా నాలుగైదు రకాల అర్థాలు తీసుకోవడం కామన్ అయిపోయింది. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి… నూతన సంవత్సర వేడుకల్లో పోటీ ఖాయమని.. ఎక్కడ నుంచి .. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనని అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది.
పొంగులేటి వ్యవహారంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కూ సమాచారం ఉందేమో కానీ.. వెంటనే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే అది నేరుగా కాదు.. ప్రస్తుతం ఆయనకు ఉన్న సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎప్రస్తుతం స్కార్ట్ వాహనంతో కలిపి 8+8 సెక్యూరిటీ ఉంది. దీన్ని కేవలం 2+2 కుదించారు. బీఆర్ఎస్ కాదంటే.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ముందుగా తెలుసుకోవాలని హెచ్చరికగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి లీడర్లు ఎక్కువ సీట్లు తక్కువ అన్నట్లుగా ఉంది. తుమ్మల, పొంగులేటి వంటి సీనియర్ నేతలు పోటీ చేయకుండా ఉండలేరు. బీఆర్ఎస్ లో ఉంటే సీటు దక్కదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. వారు పక్క చూపులు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే వీరికి సీట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్ చీఫ్.. ఎలాగైనా పార్టీలోనే ఉంచుకోవాలని తాపత్రయ పడుతున్నారు. మరి ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో తెలియదు మరి !