చాలారోజుల తరువాత ఎమ్మెల్యేలతో మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శాసనసభ పక్షం సమావేశమైంది. ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి వస్తున్న జంపింగ్ ఎమ్మెల్యేలతో కలుపుకుని ఎమ్మెల్సీల ఎన్నిక ఏకపక్షమే కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో కేసీఆర్ మాట్లాడారు. 16 ఎంపీలను గెలిపించాల్సిన పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుందన్నారు. కాంగ్రెస్ బలంగా లేదనీ, అలాగని అలసత్వంతో ఉండొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లాంటి చోట్ల పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించిందనీ, ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని కాస్త ఘాటుగానే చెప్పారట. అందరూ ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని కూడా ఒక దశలో కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం!
ఈనెల 15న కరీంనగర్, 19న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభలను కేసీఆర్ నిర్వహించబోతున్నట్టు చెప్పారు. మరి కొద్దిరోజుల్లో ఎంపీ టిక్కెట్లను ప్రకటించేసి, వరుసగా 8 బహిరంగ సభల్లో పాల్గొనేందుకు కేసీఆర్ సిద్ధమౌతున్నారు. అంటే, రెండేసి పార్లమెంటు నియోజక వర్గాలను కలుపుతూ ఒక సభ ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, టిక్కెట్ల విషయానికొస్తే… ముగ్గురు సిట్టింగు ఎంపీలను మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వారు ఎవరనేది నేరుగా చెప్పకపోయినా, ఖమ్మం, మహబూబ్ నగర్, మెహబుబాబాద్ ఈ స్థానాల్లో అభ్యర్థులపై ఇంకా స్పష్టతకు రాలేదని సమాచారం.
ఈ ఎన్నికల్లో ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపై పెట్టడంతో, ఇకపై శాసన సభ్యులంతా సొంత నియోజక వర్గాల్లో ఉండాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థితో సంబంధం లేకుండా వారే స్వయంగా రోజూ ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షిస్తారనీ, అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటారని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి! నిజానికి, ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తెరాస గెలుస్తుందనడంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. అలాగని, అదే ధీమాతో ఉండటం మంచి కాదు కాబట్టి… తెరాస ఎమ్మెల్యేలపై ఇలా మొత్తం బాధ్యతను పెడుతున్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు.