తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్తారని బీఆర్ఎస్ వర్గాలు అనుకున్నాయి. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో ముందస్తు ఎన్నికలే ఉండవని ప్రకటించారు. దీనికి కారణం కవిత ఎదుర్కొంటున్న పరిస్థితులే. కవితకు అండగా ఉండే విషయంలో తెలంగాణ అధికార పార్టీ అండకొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అధికారాన్ని వదులుకుంటే.. కవితకూ అండగా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఓ రకంగా ఇప్పుడు సీఎం కేసీఆర్కు అధికారం చాలా అవసరమే కాదు.. ఎంతో ముఖ్యం కూడా. ఇలాంటి సమయంలో ఆయన అధికారాన్ని చేజేతులా వదులుకుని అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని భావించారంటున్నారు.
ముందస్తుకు వెళ్తే గెలుపు ఖాయం అయినప్పటికీ.. ఇప్పటికిప్పుడు అధికారం వదులుకుంటే కవితకు కాపాడుకునేందుకు ఉన్న అవకాశాలు కూడా చేజేతులా వదిలేసినట్లవుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా ఎన్నికలు నిర్వహిస్తారన్న గ్యారంటీ లేదు. కర్ణాటకలో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే ఈసీ కూడా ఆసక్తి చూపించదని భావిస్తున్నారు. ఇదే చాన్స్ గా బీజేపీ రాష్ట్రపతి పాలన విధిస్తే మొదటికే మోసం వస్తుంది .
ముందస్తు లేదని తేల్చడంతో కేసీఆర్ పార్టీ నేతలకు ఇతర టాస్కులు ఇచ్చారు. పాదయాత్రలు చేయాలని సూచించారు. పాదయాత్రలకు అంత సీన్ లేదని చెబుతూ వస్తున్న కేసీఆర్.. పార్టీ నేతలందరూ అదే చేయాలని చెప్పడం ఆయన ఆలోచనల్లో వస్తున్న మార్పునకు సంకేతాలని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.