కేసీఆర్ మార్చాలని అనుకోకపోయినా ఒకరు రిటైర్మెంట్.. ఇంకొకరు కోర్టు తీర్పు వల్ల మారిపోయారు. తెలంగాణకు ఇప్పుడు కొత్త డీజీపీ, కొత్త సీఎస్ వచ్చారు. ఇప్పుడు అధికార యంత్రాంగం మొత్తాన్ని కేసీఆర్ ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు, ఎస్పీలే కీలకం. వచ్చే ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చు. దీంతో పూర్తి స్థాయి సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
మెజార్టీ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయక ముందు దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. కొత్త డీజీపీ అంజనీకుమార్ మార్పు చేర్పులు చేస్తున్నారు. పూర్తిగా విధేయంగా ఉండే వారికి ఈ సారి కీలక పోస్టులు దక్కనున్నట్లుగా చెబుతున్నారు. ఇక జిల్లాల కలెక్టర్లను కూడా ఎవరెవర్ని నియమించాలనేదానిపై సీఎస్ గా సోమేష్ కుార్ ఉన్నప్పుడే కసరత్తు పూర్తయింది. ఎక్కువ జిల్లాలకు ఎక్కువమంది కన్ఫర్డ్ ఐఏఎస్‌లను కలెక్టర్లను నియమించాలని నిర్ణయించారు. లిస్ట్ కూడా రెడీ అయింది. సంక్రాంతి తర్వాత ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల కేంద్రం తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారులపై దృష్టి పెట్టి ఒత్తిడి పెంచుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఒత్తిడి తలొగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వానికే నిబద్ధతగా ఉండే అధికారులను గుర్తించి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాలనాపరంగా, ఎన్నికల పరంగా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో కీ రోల్ పోషించే అవకాశం ఉండడంతో పోస్టింగ్‌లపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ ఎన్నికలు తాడోపేడో తేల్చుకునేవి కాబట్టి కేసీఆర్ ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టదల్చుకోలేదని చెబుతున్నారు.