జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి… శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. అచ్చి వచ్చిన యాగాలను కూడా నమ్ముకుంటున్నారు. విశాఖ పర్యటనలో ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందతో..ఆయన సహస్ర ఆయుత చండీయాగం గురించి చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆయుత చండీయాగం నిర్వహించారు. అది దేశంలోనే చర్చనీయాంశమయింది. అత్యంత భారీగా నిర్వహించిన ఆ యగానికి దేశం మొత్తం నుంచి ప్రముఖుల్ని ఆహ్వానించారు. పిలిచిన వాళ్లంతా యాగానికి వచ్చి వెళ్లారు. ఆ యాగానికి లభించిన ప్రచారం, చేసిన తీరు చూసి.. ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుందో.. ఎవరూ అంచనా వేయలేకపోయారు. అప్పుడే.. ఆయుత చండీయాగానికి తోడుగా.. సహస్ర ఆయుత చండీయాగం నిర్వహించనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రెండో సారి గెలవడంతో…ఆ యాగం ఆలోచనకు కార్యరూపం ఇస్తున్నారు.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు కాబట్టి… సహశ్ర ఆయుత చండీయాగం లక్ష్యాన్ని దేశం మొత్తానికి విస్తరించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం దీన్ని చేయబోతున్నారు. కేసీఆర్కు యాగాలపై అమితమైన విశ్వసం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో యాగాలను నిర్వహించిన ఆయన రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చాక కూడా వాటిని జరిపారు. ఎన్నికలకు ముందు తమ వ్యవసాయ క్షేత్రంలో రెండురోజులపాటు రాజశ్యామల యాగం జరిపారు. యాగం విషయంలో స్వరూపానంద కొన్ని సూచనలు చేశారని.. వాటి ప్రకారం… ఎన్నికల ముందు నిర్వహించినా.. ఆశ్చర్యపోనవసరం లేదని కొంత మంది చెబుతున్నారు. కానీ.. సహస్ర ఆయుత చండీయాగం నిర్వహించడం అంత సులభం కాదని.. రెండు, మూడు నెలల్లో సన్నాహాలు కూడా సాధ్యం కాదని మరికొంత మంది చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందు కానీ.. తర్వాత కానీ.. కేసీఆర్ మరో భారీ యాగ కార్యక్రమం నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది.
కేసీఆర్వి మూఢ నమ్మకాలంటూ.. అనేక విమర్శలు వస్తూంటాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. ఎన్నికల ప్రచారం కేసీఆర్ను విమర్శించారు. ఆయన ఉప్పు, నిమ్మకాయని నమ్ముకుంటారంటూ ఎగతాళి చేశారు. దానికి కేసీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే వచ్చి తీర్థం తీసుకుని పోవాలి కానీ.. తాను యాగాలు చేయడం వల్ల మోడీకి వచ్చిన నష్టమేంటి అని ప్రశ్నించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. కేసీఆర్ మాత్రం.. తను అనుకున్న యాగాలు.. చేస్తూనే ఉన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.