తెలంగాణ రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి కాకుండా భారత రాష్ట్ర సమితికి ఎన్డీఏ కూటమి పార్టీ జేడీఎస్ మద్దతు పలికింది. ఆ పార్టీ నేత కుమారస్వామి బెంగళూరులో ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదని.. ఆ పార్టీని నమ్మవద్దని.. కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలం అయిందని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం అని ఆరోపించారు. తెలంగాణలో .రైతులకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని.. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే రూ.73 వేల కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారన్నారు.
గతంలో కర్నాటకలో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేవారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4 వేలు ఇవ్వడం లేదు. రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కర్నాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కర్నాటకలో రైతులకు ఇస్తున్నది కేవలం 2 గంటల కరెంటేనన్నారు. ఇలా అన్ని అంశాల్లో బీఆర్ఎస్తో పోలుస్తూ.. కుమారస్వామి మద్దతు ప్రకటన చేశారు. ఇంతా చేసి కుమారస్వామి ఇటీవల ఎన్డీఏలో చేరారు. బీజేపీ కూటమిలో ఉంటూ… ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీకి మద్దతు తెలిపారు.
భారత రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు ఆ పార్టీతో కలిసి పని చేయడానికి కుమారస్వామి కూడా ఆసక్తిచూపారు. కానీ తరవాత హఠాత్తుగా దూరమయ్యారు. ఎందుకు దూరమయ్యారో స్పష్టత లేదు కానీ.. బీఆర్ఎస్ వైపు నుచి కుమారస్వామికి ఎలాంటి మాట సాయంకూడా అందలేదు. కానీ ఇప్పుడు కుమారస్వామి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు మాట సాయంచేస్తున్నారు. అందు కోసం బీజేపీని కూడా మర్చిపోతున్నారు.