చినజీయర్ స్వామి తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో నజరానా పొందారు. యాదాద్రి టెంపుల్ డెలవప్మెంట్ అధారిటీ పరిధిలో… రెండు ఎకరాల ముప్ఫై గుంటల స్థలాన్ని.. రూ. 16 లక్షల 50లకు పొందారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమూ… దానికి తగ్గట్లుగా వైటీడీఏ అధికారులు చినజీయర్ స్వామి ట్రస్ట్‌కు రిజిస్టర్ చేయడమూ జరిగిపోయాయి. ఐదే తేదీన దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎకరాకు రూ. ఆరు లక్షల చొప్పున.. చినజీయర్ స్వామికి ఈ భూమిని వైటీడీఏ అప్పగించింది. ఆ స్థలంలో ఆయన ఆశ్రమాన్ని నెలకొల్పి.. ట్రస్టు తరపున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన భూమి చినజీయర్ ఆశ్రమానికి..!
వైటీడీఏ పరిధిలో.. గుండ్లాపల్లి అనే గ్రామం ఉంది. యాదాద్రికి వెళ్లే దారిలో… యాదాద్రి కంటే ముందు వచ్చే గ్రామం గుండ్లాపల్లి. దీన్ని కూడా.. వైటీడీఏ పరిధిలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రిని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. దాని కోసం 2015లో కనీసం ఇరవై సార్లు యాదాద్రికి వెళ్లారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే.. పెద్ద ఎత్తున స్థలాలు అవసరమని చెప్పి.. ప్రత్యేకంగా వైటీడీఏను ఏర్పాటు చేసి… పొలాలను కొనుగోలు చేశారు. వైటీడీఏ పరిధిలోని పలు గ్రామాల్లోని రైతుల నుంచి వైటీడీఏ భూములను కొనుగోలు చేసింది. ఇప్పుడు… చినజీయర్ ట్రస్ట్ కు కేటాయించిన రెండు ఎకరాల ముఫ్పై గుంటల స్థలం కూడా… అలా రైతుల వద్ద కొనుగోలు చేసిందే.
ఎకరం రూ. ఆరు లక్షలకే అప్పగించిన సర్కార్..!
యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకుంది. ఒక్కో ఎకరం అప్పట్లోనే రూ. మూడు, నాలుగు కోట్లకు చేరింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతుల్లేకుండా విపరీతంగా వెలిశాయి. అయితే వైటీడీఏ పరిధిలోచేరిన గ్రామాల విషయంలో మాత్రం… ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. వైటీడీఏకు అమ్మితే… అప్పటి రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం.. చూసి మూడు రెట్లు అధికంగా ఇస్తామని.. లేకపోతే.. భూసేకరణ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దాంతో.. రైతులందరూ.. తప్పని సరిగా వైటీడీఏకే అమ్మారు. ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు… ఎకరానికి రూ. 50 లక్షలు ఇస్తామన్నా.. అమ్ముకోలేక.., వైటీడీఏకే పొలాలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వం అవసరాలకు వినియోగిస్తోంది. వాటిలో రెండు ఎకరాల 30 గంటలను చినజీయర్ ట్రస్ట్‌కు కేటాయించింది.
అక్కడే హోమం నిర్వహించబోతున్నారా..?
ప్రస్తుతం యాదాద్రి రియల్ ఎస్టేట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. హైదరాబాద్ శివార్లలోని ఉప్పల్ వద్ద నుంచే…యాదాద్రి రియల్ ఎస్టేట్ వైభవం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గుండ్లాపల్లిలో ఎకరం.. రూ. ఐదు కోట్ల వరకూ పలుకుతుందని మార్కెట్లంటున్నాయి. దీని ప్రకారం… చినజీయర్ స్వామికి ఇప్పగించిన రెండు ఎకరాల 30 గుంటల స్థలం… రూ. పది నుంచి పన్నెండు కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధరకే.. ట్రస్టుకు రిజిస్ట్రేషన్ చేసింది. యాదాద్రిలో త్వరలో అత్యంత ఘనంగా.. ఓ హోమం నిర్వహించబోతున్నారు. బహుశా.. ఆ హోమాన్ని.. చినజీయర్ ట్రస్టుకు కేటాయించిన రెండు ఎకరాల 30 గుంటల స్థలంలోనే నిర్వహించవచ్చని చెబుతున్నారు.