గ్రేటర్ ఎన్నికలలో తెరాసని గెలిపించడం ‘నాన్నకు ప్రేమతో…’ అయితే అందుకు కారకుడయిన మంత్రి కె.టి.ఆర్.కి ముఖ్యమంత్రి కేసీఆర్ మునిసిపల్ శాఖను బహుమతిగా ఈయడం ‘కొడుకుకి ప్రేమతో…’అని అనుకోవలసి ఉంటుంది. వారి ప్రేమకు, సంతోషానికి అద్దం పడుతూ గ్రేటర్ ఎన్నికలలో గెలిచిన తరువాత తండ్రీ కొడుకులిద్దరూ ఆలింగనం చేసుకొన్న ఫోటోలు విస్తృతంగా మీడియాలో దర్శనమిచ్చాయి.
కె.టి.ఆర్.కి మునిసిపల్ శాఖను కేటాయిస్తూ జీ.ఓ. జారీ చేయడం కూడా జరిగిపోయింది. దానికి పార్టీలో ఎవరూ కూడా అభ్యంతరం చెప్ప(లే)రు. ఉన్నత విద్యావంతుడయిన కె.టి.ఆర్. ఆ పదవిని సమర్ధంగా నిర్వహించగలరనే విషయంలో ఎవరికీ అనుమానాలు కూడా లేవు. గ్రేటర్ ఎన్నికలలో తెరాస నెగ్గడం అనేది ఒక రాజకీయ ప్రక్రియలో భాగం. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకుకి మరో మంత్రిత్వ శాఖను కేటాయించడం అతనికి బహుమతిగా ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది.
పదవులు, అధికారాన్ని తన కుటుంబ సభ్యులకు ఆవిధంగా పంచిపెట్టడం వలన ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును. తెలంగాణాలో అధికారం ‘ఆ నలుగురు’ చేతుల్లో ఉండిపోయిందని ఇప్పటికే ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు మరో మంత్రి పదవిని కె.టి.ఆర్.కి బహుమతిగా ఈయడం వలన మరిన్ని విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును.
ఇప్పటికే ఆయన రాష్ట్ర ఐ.టి. మరియు పంచాయితీ రాజ్ శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే మరో మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం ఎంత వరకు సబబు? అని పార్టీలో మంత్రి పదవులను ఆశిస్తున్నవారు లోలోన అనుకోకుండా ఉండలేరు. మునిసిపల్ శాఖను ఆయనకు కట్టబెట్టదలిస్తే, పంచాయితీ రాజ్ శాఖను వేరొకరికి అప్పగించి ఉంటే వారు సంతృప్తి చెందేవారు కదా?
కె.టి.ఆర్.ని రాజకీయంగా మరింత ప్రమోట్ చేసేందుకు గ్రేటర్ ఎన్నికలలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి పార్టీలో సీనియర్ నేతలందరినీ దూరంగా ఉంచినందుకు వారు చాలా అసంతృప్తికి గురయిఉండవచ్చును. ఆ తరువాత ‘కేసీఆర్ వారసుడు కె.టి.ఆర్.’ అని కవిత ప్రకటించడం, వెంటనే కె.టి.ఆర్. అదనంగా మరో మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం వంటివన్నీ పార్టీలో అసంతృప్తికి దారి తీయవచ్చును.