…ఇదీ సీఎం కేసీఆర్ ఫైనల్ గా చెప్పిన మాట. ఒకే దెబ్బకి రెండు పిట్టలు..! ఆర్టీసీలో యూనియన్లు ఖతం. ఆగ్రహించిన ఆర్టీసీ ఉద్యోగుల పూర్తిగా ప్రసన్నం! ఒక్క మీటింగుతో లెక్కలు బరాబర్. భవిష్యత్తులో సమ్మెలంటే మంచిగుండదు అంటూ నవ్వుతూ మందలిస్తూనే… అనుకుంటే ఏదైనా సాధిస్తారు అంటూ కార్మికుల్లో నయా జోష్ నింపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మాట్లాడారు. చేతికి ఎముక లేదన్నట్టుగా ఆర్టీసీ ఉద్యోగులపై వరాలు గుమ్మరించారు! ఇకపై ఆర్టీసీ కార్మికులు అనొద్దు.. ఉద్యోగులు అనాలన్నారు. సమ్మె రోజుల జీతం ఇచ్చేస్తామన్నారు. రిటైర్మెంట్ వయసు మరో రెండేళ్లు పెంచారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగుల్ని వేరే బాధ్యతలు అప్పగించి కాపాడుకుందామన్నారు. ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్ పాసులు, తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మెనెంట్ చేయడం, ఉద్యోగులకు ఉచితంగా మందులూ చికిత్సలు.
మహిళా ఉద్యోగులకు మరిన్ని వరాలు. సాయంత్రం ఏడున్నరలోపే మహిళా ఉద్యోగుల షిఫ్టులు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలన్నారు. ప్రసూతి సెలవుతోపాటు మరో మూడునెలల అదనపు సెలవు ప్రకటించారు. యూనిఫామ్ కూడా మార్చాలన్నారు. ప్రత్యేక టాయ్ లెట్లు, డ్రెస్ ఛేంజ్ రూమ్ లు వెంటనే కట్టిస్తామన్నారు. ఆర్టీసీ కోసం రూ. 1000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. లాభాలు వచ్చేదాకా సంస్థకు అండగా ఉంటామన్నారు. తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఇలా వరాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు కేసీఆర్! అయితే, యూనియన్లు మాత్రం వద్దన్నారు. వాళ్లు మనలోనే ఉంటారుగానీ, మనవాళ్లు కాదంటూ యూనియన్ నేతల్ని కట్ చేశారు. ఓ రెండేళ్లపాటు ఏ యూనియన్లూ లేకుండా పనిచేద్దామనీ, అప్పటికీ బాగోకుంటే మళ్లీ యూనియన్లకే పోదామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో ఓసారి ఆర్టీసీలో ప్రయాణం చేయాలన్నారు.
సీఎం ప్రసంగం సాగుతున్నంతసేపూ… ఈయన ఆయనేనా, ఎంతలో ఎంత మార్పు అనిపించింది! సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారూ పొండి అనేసి.. ఇప్పుడు ఎవ్వర్నీ పోనివ్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటం అన్నారు. మంచి మార్పే! ఈ అనూహ్య మార్పు వెనక కేసీఆర్ ఆశించింది కూడా నెరవేరుతుందనడంలో సందేహం లేదు. ఇకపై, సమ్మె జరగడానికీ, ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికీ, ప్రభుత్వ రంగ సంస్థకి ప్రభుత్వమే సహకరించకపోవడానికీ కారణం ఎవరనే చర్చ ఇకపై ఉండొద్దు. ప్రైవేటీకరణ చేస్తామనీ, ఐదువేల రూట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు సిద్ధమైందనే ప్రశ్న ఇకపై ఉండొద్దు! వీటిపై ప్రతిపక్షాలూ సంఘాలూ ఇలాంటివేవీ నోరు మెదిపే అవకాశం అస్సలు ఉండొద్దు. ఇకపై వినిపించాల్సింది ఒకే ఒక్కటి… ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన వరాలు మాత్రమే! ఇకపై కచ్చితంగా అవే వినిపిస్తాయనడంలో సందేహం లేదు. ఈ లక్ష్య సాధనలో భాగంగా నవ్వుతూ నవ్విస్తూ సీఎం ప్రసంగం ఆద్యంతం కరతాళధ్వనులతో ప్రగతి భవన్ లో కొనసాగింది!