తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి జోష్ మీద ఉన్నారు. దళిత బంధు పథకాన్ని ఆయన చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాకుండా… తన దత్తత గ్రామం వాసాల మర్రిలోనే దళిత బంధును ప్రారంభించేశారు. ఈ రోజు ప్రత్యేకంగా వాసాల మర్రికి వెళ్లిన ఆయన… ఎస్సీ కాలనీలో కలియ తిరిగారు. దళిత కుటుంబాలతో సమావేశమయ్యారు. సమావేళంలో షాకింగ్ న్యూస్ చెప్పారు. వారి అకౌంట్లలో రేపే రూ. పది లక్షలు జమ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో అక్కడున్న దళిత కుటుంబాలు ఒక్క సారిగా సంభ్రమాశ్చర్యానికి గురయ్యాయి.
వాసాలమర్రిలోమొత్తం అర్హులైన దళిత కుటుంబాలు 76 ఉన్నాయని… వారికి రూ. ఏడు కోట్ల అరవై లక్షలు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే.. ఓ పది వేలు మాత్రం మినహాయించుకుంటామని.. ఆ పది వేలకు మరో పది వేలు కలిపి నియోజకవర్గ వ్యాప్తంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటిని దళితులే ఏదైనా ఆపద వస్తే ఉపయోగించుకోవచ్చని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్… ఆగస్టు పదహారో తేదీ లోపు ఎన్నికల కోడ్ వస్తే.. పథకం అమలుకు ఇబ్బంది అవుతుందని అందుకే ముందుగానే వాసాలమర్రిలో అమలు ప్రారంభించేశారని భావిస్తున్నారు. ఈ పథకాన్ని తాను గత ఏడాదే ప్రారంభించాలని అనుకున్నానని కానీ… కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రకటించారు.
కారణం ఏదైతేనేం దళిత బంధు పథకాన్ని ముందుగా వాసాల మర్రి దళితులు అందుకుంటున్నారు. హుజూరాబాద్‌లోని దళితులు అందరూ అందుకుంటారో లేదో తెలియదు… ఇతర నియోజకవర్గాల్లోని దళితులకు ఎప్పుడు అందుతుందో తెలియదు కానీ.. వాసాలమర్రి దళితులకు మాత్రం రేపే అందబోతోంది. ఈ దళిత బంధు నిధుల్ని దుర్వినియోగం చేయవద్దని… అభివృద్ధి చెందేందుకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.