తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం తెలంగాణా ఆర్టీసీ సంస్థ పనితీరు, లాభానష్టాలని సమీక్షించారు. ఆ సందర్భంగా అధికారులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన అభిప్రాయలు వ్యక్తం చేశారు. “ప్రైవేట్ బస్సులు నడిపే సంస్థలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ కూడా లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు ఆర్ధిక సహాయం, సహకారాలు అందుకొంటూ, 90 లక్షల మంది ప్రయాణిస్తున్న ఆర్టీసీ సంస్థ ఎప్పుడూ ఎందుకు నష్టాలలోనే నడుస్తోంది? అంటే లోపం మనలోనే ఉందన్న మాట! ప్రయాణికుల అవసరాలకి అనుగుణంగా బస్సులు నడపడం లేదు. ఆర్టీసిలో ఆదాయ వ్యయాలని, వాటి కారణాలని కనుగొని అందుకు తగిన విధంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకొనేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్టీసిని లాభాల పట్టించవచ్చు. అలాగే ఆర్టీసిని పర్యాటక దేవాదాయ శాఖలతో అనుసంధానం చేయడం ద్వారా ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు. నగరాలు, పట్టణాలు, గ్రామాల అవసరాలకి అనుగుణంగా ఆర్టీసిలో చిన్న చిన్న బస్సులని నడిపించడం ద్వారా దుబారాని అరికట్టవచ్చు. ప్రయాణికుల అవసరాలకి అనుగుణంగానే బస్సులు నడపాలి,” అని కెసిఆర్ తన మొదటి సమీక్షా సమావేశంలోనే చాలా విలువైన సలహాలు ఇచ్చారు.
సలహాలతో బాటు ఉద్యోగులకి గట్టి హెచ్చరికలు కూడా చేశారు. “ఆర్టీసి నష్టాలలో నడుస్తున్నప్పటికీ ఉద్యోగులు అడగగానే 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాము. కనుక ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. అలాగైతేనే ఆర్టీసిని నడిపిద్దాము. లేకుంటే మూసేసి ప్రైవేట్ సంస్థలకి అప్పగించేద్దాము. ఉద్యోగులు రాజకీయ కారణాలతో సమ్మెలు చేస్తే సహించను. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ తమ సంస్థని కాపాడుకొంటూ మళ్ళీ లాభాల బాట పట్టించడానికి సమిష్టి కృషి చేయాలి,” అని హెచ్చరించారు.
ఆర్టీసి ఉద్యోగ సంఘాల నేతలందరితో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. వారి సూచనలు, సలహాలు కూడా స్వీకరించిన తరువాత ఆర్టీసికి భవిష్యత్ కార్యాచరణ విధివిధానాలని రూపొందిస్తారు. ఉద్యోగులు సహకరించకుంటే ఆర్టీసిని ప్రైవేట్ పరం చేస్తామని కెసిఆర్ హెచ్చరించడం చాలా సాహసోపేతమైన విషయమేనని చెప్పక తప్పదు. ఆర్టీసిని కాపాడుకొని మళ్ళీ లాభాలబాట పట్టించాలనే ఉద్దేశ్యంతో ఆవిధంగా హెచ్చరించారని భావించవచ్చు. కనుక ఉద్యోగ సంఘాల నేతలు కూడా దానిని అదే విధంగానే స్వీకరిస్తే మంచిదే లేకుంటే రేపటి సమావేశంలో ఘర్షణ వాతావరణం తప్పదు.