ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతంలో పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఆందోళనలు చేసేది. ఆ తర్వాత వాకౌట్ చేసేది. రాష్ట్రఅంశాలను లేవనెత్తేవాళ్లు. అయితే ఈ సారి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వాకౌట్ చేసి వెళ్లిపోతే బీజేపీకి సహకరించినట్లేనని విపక్షాలు ఆరోపిస్తూఉంటాయి. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే తాము మాత్రమే ఆందోళన చేస్తే సపోర్ట్ రాదు కాబట్టి ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో నిరసనలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా విభేదిస్తూ.. సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఏ పార్టీ కూడా ముందుకెళ్లే అవకాశం లేదు. కానీ టీఆర్ఎస్ అలా చేయకపోతే .. బీజేపీతో లాలూచీ పడిందేనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎందుకంటే ఆ స్థాయిలో బీజేపీపై పోరాటం చేస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ప్రకటనలు చేశారు. అందుకే టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఏం చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేస్తున్నారు.
పార్లమెంట్లో తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడామని బాగా ప్రచారం పొందేలా కార్కక్రమాలను కేసీఆర్ ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పార్లమెంట్ లోపల చేయడం సాధ్యం కాదు కాబట్టి.. బయటే ఆ నిరసనలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. బీజేపీతో పోరాటం కన్నా.. పోరాడుతున్నట్లుగా కనిపించడమే ఇప్పుడు టీఆర్ఎస్కు పెద్ద టాస్క్‌గా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.