తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరికైనా నజరానా ప్రకటించాలనుకుంటే .. ఆ మెప్పు పొందినవారికి పట్టపగ్గాలు లేనంత ఆనందం కలిగిస్తారు. ఆ విషయం మరోసారి రుజువు చేశారు. మొన్న ప్రకటించిన పద్మ అవార్డుల్లో పద్మశ్రీ పొందిన దర్శనం మొగులయ్యకు ప్రగతి భవన్లో సన్మానం చేయడమే కాకుండా ఏకంగా రూ. కోటి సాయం ప్రకటించారు. అంతే కాదు హైదరాబాద్లో ఇంటి స్థలం కూడా ప్రకటించారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికే రూ.కోటి అన్నమాట.
దర్శనం మొగులయ్య ఇటీవలి కాలంలో చాలా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నారు. తాను స్వయంగా తయారు చేసుకుని పాడే కిన్నెర వాద్యకారుడు దర్శనం మొగులయ్య. ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ అది డబ్బు సంపాదించే అంత లేదు. గతంలో కొన్ని టీవీ చానళ్లు ఆయన కోసం ఫండ్ రైజింగ్ చేశాయి. కొంత ఆదుకున్నాయి. అప్పట్లో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఇటీవల ఆయనకు మంచి రోజులు వచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ఆయనతో పాటించడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. పవన్ కల్యాణ్ కూడా రూ. లక్ష సాయం చేశారు.
ఆ తర్వాత ఆర్టీసీ సంస్థ ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంది.ఇప్పుడు పద్మశ్రీ రావడంతో కేసీఆర్ రూ. కోటి సాయం ఇంటి స్థలం ప్రకటించారు. తెలంగాణ కళాకారుల్ని కాపాడుకుంటామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే మొగులయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.