తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం ఎనిమిది గంటల పాటు సాగింది.ఈ రోజు మధ్యాహ్నం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇన్ని గంటల పాటు ఏం చర్చించారబ్బా.. అన్న ఆశ్చర్యం టీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశానికి అజెండా రెడీ అయిపోతుంది. దానికో ప్రక్రియ ఉన్నా… ముఖ్యమంత్రి.. సీఎంవోనే మొత్తం అజెండా డిసైడ్ చేస్తారు. అధికారికంగా మంత్రులకూ ముందే సమాచారం వెళ్తుంది. వెళ్లకపోయినా ఎవరూ పట్టించుకోరు. కేబినెట్లో ఎవరూ ఏ అంశంపైనైనా వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు. అన్నీ ముఖ్యమంత్రికి తెలిసే వస్తాయి కాబట్టి.. అలాంటి సాహసం చేయరు. ఆమోదించడమే చాయిస్ . అయితే ఇంత మాత్రం దానికి ఎనిమిది గంటల పాటు ఏ ఏ అంశాలపై చర్చలు జరిపారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం.
ఇక రెండో రోజు కేబినెట్ సమావేశంలో … ఉద్యోగాల భర్తీపై చర్చిస్తారని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా కేబినెట్ భేటీ జరుగుతోందంటే.. అందరికీ ఉద్యోగాల గురించే ప్రస్తావన వస్తోంది.యాభై వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతారా… ఖాళీలన్నీ భర్తీచేస్తారా.. అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే.. తొలి రోజు ఎనిమిది గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ఉద్యోగాలపై చర్చ జరగలేదు. ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రెండో రోజు మొత్తం ఉద్యోగాల భర్తీపై చర్చ నిర్వహిస్తారని అంటున్నారు.
మరోవైపు అసలు విషయం అది కాదని.. ఉద్యోగాల గురించి తీసుకునే కేబినెట్ నిర్ణయంపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలంటే.. ఆ అంశంపైనే ప్రత్యేకంగా కేబినెట్ భేటీ జరగాల్సి ఉంటుందని.. ఆ వ్యూహం ప్రకారమే మరోసారి భేటీ నిర్వహిస్తున్నారని అంటున్నారు. అన్ని శాఖల కార్యదర్శులు ఖాళీల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. అవసరం అయినప్పుడు… నిర్ణయం తీసుకుని కేబినెట్ సమావేశం కూడా పెట్టకుండా ఫైళ్లను మంత్రుల వద్దకే పంపించిసంతకాలు తీసుకున్న సందర్భాల నుంచి ఇప్పుడు రోజుల తరబడి కేబినెట్లో పాలసీలపై చర్చించేంతగా ప్రజాస్వామ్యం తెలంగాణలో మారిందని సెటైర్లు పడుతున్నాయి.