తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలకు తరచూ ఓ టెన్షన్ ఉంటూ వచ్చింది…! అదేంటంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వేలు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తూ.. వాటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని చెబుతూ ఉండేవారు. దీంతో కొన్నాళ్లపాటు ఎమ్మెల్యేలందరికీ ఈ సర్వే టెన్షన్ ఉండేది. సరే, అసెంబ్లీ రద్దు చేసేశారు.. దూకుడుగా 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు, చారిత్రకం అనేశారు. వీరిలో కొంతమందిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ, కొన్ని స్థానాల్లో మార్పులు తప్పవనే అభిప్రాయం అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచే వినిపిస్తోంది. దానికి అనుగుణంగానే అసంతృప్తులూ బయటపడుతున్నాయి. అయితే, మార్పులు తప్పవనుకునే ఆ కొద్ది స్థానాలతోపాటు… మొత్తంగా 105 మందినీ కేసీఆర్ ఇంకా టెన్షన్ పెడుతూనే ఉన్నారట!
తొలి జాబితాలోని అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో అనేదానిపై కేసీఆర్ గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రతీ నియోజక వర్గంలో కొంతమందితో నిఘా పెట్టించారనీ, వాని నుంచి ప్రతీరోజూ నివేదికలు కేసీఆర్ కి చేరుతున్నాయట! ముఖ్యంగా, అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తమౌతున్న ప్రాంతాల్లో సదరు అభ్యర్థులు చేపడుతున్న ప్రచారం ఎలా ఉంటుంది, ప్రజలను కలుసుకుంటూ వారిలోని వ్యతిరేకతను పోగొట్టేందుకు సదరు అభ్యర్థులు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు, అవి ఎంతవరకూ వర్కౌట్ అవుతున్నాయి… ఇలాంటి సమాచారం రోజువారీగా కేసీఆర్ తెప్పించుకుంటున్నారు. దీంతో ఏం చేస్తారంటే…. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ప్రకటించిన అభ్యర్థుల అందరి పనితీరునూ ఇలా అంచనా వేస్తారట! ఇన్నాళ్లపాటు ప్రచారం చేసినా స్థానికంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకోలేని అభ్యర్థులను మార్చేందుకు ఈ నిఘా నివేదికల్ని వాడుకుంటారట!
దీంతో ప్రకటించిన అభ్యర్థులందరికీ కొత్త టెన్షన్ మొదలైందని సమాచారం! ఏవో కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులు మార్పు తప్పదనీ, వారిపై మాత్రమే నిఘా ఉంటుందని అనుకున్నారుగానీ… ఇలా అందరిపైనా ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొంత ఆందోళన వ్యక్తమౌతోంది! నిజానికి, ఇదీ ఒక రకమైన మేనేజ్మెంట్ టెక్నిక్ అనుకోవాలి! టిక్కెట్ దక్కినవారు కూడా నోటిఫికేషన్ వచ్చాక చూద్దామని ఎదురుచూడకుండా, ప్రతీరోజూ ప్రజల్లో ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను పరుగులు తీయిస్తారు కదా! ఏదైతేనేం, ప్రకటిచిన 105లో బీఫామ్ లు అందుకునేవారు ఎంతమంది అనేది ఇప్పుడు కేసీఆర్ కొత్తగా మెంటెయిన్ చేస్తున్న సస్పెన్స్..!