తెలంగాణలో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెంచుకున్న వివిధ వర్గాలను గుర్తించి.. వారిని మంచి చేసుకునేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. వాటిని ఒకటొకటిగా అముల చేస్తున్నారు. యువత తీవ్ర అసంతృప్తిలో ఉందని గుర్తించిన కేసీఆర్ ఒకే సారి యాభై వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి ప్రక్రియ సాగుతోంది. గతంలో చేసిన ప్రకటనలు.. ఆరేళ్లలో సరిగ్గా నోటిఫికేషన్లు ఇవ్వని కారణం.. ఇచ్చినా న్యాయపరమైన చిక్కుల్లో పడేలా చేసి.. తర్వాత పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల యువతలో ఈ ఉద్యోగాలభర్తీపై నమ్మకం లేకుండా పోయింది. అయితే… నమ్మకం పెంచుకునేందుకు వాటిని పక్కాగా భర్తీచేయాలనుకుంటున్నారు కేసీఆర్. ఈ సారి మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలనుకుంటున్నారు.
అదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మరో వర్గం ఉద్యోగులు. ఉద్యోగులు తనపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. కేసీఆర్కు తెలుసు. అందుకే ఆయన గ్రేటర్ ఎన్నికల్లో ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో నియమించలేదు. అదే సమయంలో… పోస్టల్ ఓట్లలో అత్యధికం బీజేపీకి వెళ్లాయి. ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా.. ఏ హామీ అమలు చేస్తే ఉద్యోగులు ఎక్కువ జోష్ ఫీలవుతారో…దాన్నే ఎంపిక చేసుకుని మొదట అమలు చేయాలనుకున్నారు . ఉద్యోగులు కొన్ని రోజులుగా పే రివిజన్ కమిటీ సిఫార్సులను అడుగుతున్నారు. పీఆర్సీని ఆమోదించాలని కోరుతున్నారు. దీంతో కేసీఆర్ మొదట ఈ అంశాన్నే టేకప్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సారి పీఆర్సీ ప్రకటించారు. 42 శాతం వరకూ జీతం పెంచారు. 2018నాటికి మరో పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. సిఫార్సుల కోసం కమిటీని నియమించారు కానీ… నివేదిక అదే పనిగా ఆలస్యం అవుతోంది. ఇప్పటికీ సమర్పించలేదు. ప్రభుత్వం ఎప్పుడు సమర్పించమంటే.. అప్పుడు సమర్పిస్తారు. ప్రభుత్వం ఎంత చెబితే అంత సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు గతంలోలా భారీగా పే రివిజన్ ప్రకటించి.. వారిని ఖుషీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆర్థికంగా భారం అయినప్పటికీ.. రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఉద్యోగవర్గాల సహకారం.. ఎంతో అవసరం అని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే… పీఆర్సీని ఘనంగా ప్రకటించాలని భావిస్తున్నారు. బహుశా..మరో నెలలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.