ప్రాజెక్టుల కోసం భూసేకరణ పేరుతో రైతులను, సామాన్యులను కష్టాల పాలు చేయడం చాలా కాలంగా ఉన్నదే. దానికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం 2013లో పక్కా భూసేకరణ చట్టం తెచ్చింది. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతో సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధార పడిన వారు రోడ్డున పడకుండా తీసుకోవాల్సిన చర్యలను అందులో స్పష్టంగా నిర్దేశించారు. సంక్షేమానికి చాలా పెద్ద పీట వేస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా జీవో తీసుకొచ్చి హైకోర్టు చేత మొట్టికాయలు తినాల్సి వచ్చింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యవహారంలో ప్రభుత్వ వ్యవహార శైలి మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉంది. ముంపు గ్రామాలను పోలీస్ క్యాంపులుగా ఎందుకు మార్చారు? రైతులను ఎందుకు భయపెడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు రియల్ ఎస్టేట్ ఏజెంటుగా ప్రవర్తిస్తోంది? ప్రతిపక్షాల వారిని అటు వైపు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో నిజాం పోకడలు ఏమిటి? ఇవన్నీ ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలు. వీటికి నిర్దిష్టంగా జవాబు చెప్పడానికి బదులు కేసీఆర్ ప్రభుత్వం తనదైన శైలిలో ప్రతిస్పందించింది. ప్రతిపక్షాలు ప్రజా ద్రోహులని సూత్రీకరించింది. అదేమిటో, తనకు నచ్చని వారిని సన్నాసి అనడం కేసీఆర్ కు మొదటి నుంచీ అలవాటు.
జీవో 123 పేరుతో తెచ్చిన ఆదేశాలు రైతు కూలీలకు వ్యతిరేకంగా ఉన్నాయనేది ప్రభుత్వం మొదట ఎందుకు గుర్తించలేదో అర్థం కాదు. ఇంత సున్నితమైన, కీలకమైన అంశంపై బిల్లు తెచ్చేటప్పుడు న్యాయ నిపుణులు రాజ్యాంగ నిపుణులతో సంప్రదిస్తారు. 2013 చట్టంలో ఉన్నదేమిటి, ఇందులో లేనిదేమిటి, కోర్టులో వీగిపోయే అవకాశాలు ఏమేరకున్నాయనేది కూడా పట్టించుకోకుండా బిల్లు తేవడం ఆశ్చర్యకరం. అసలు ఆ చట్ట ప్రకారమే మెరుగైన పరిహారం ఇచ్చి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కావు. అలా చేయకుండా పంతానికి పోవడం ఏమిటనేది విపక్షాల ప్రశ్న.
తెలంగాణ రైతుల కోసం ప్రాజెక్టులు కడతామనే వారు, అదే తెలంగాణలోని వ్యవసాయ కూలీల ప్రయోజనాలను ఎలా విస్మరిస్తారు? కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని పక్కనబెట్టి జీవో తెచ్చారంటే దానికంటే మెరుగైంది కావచ్చని అనుకుంటారు. కానీ ఇలాంటి కూలీల వ్యతిరేక జీవో తీసుకు వచ్చి చివాట్లు తినే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం చేజేతులా తెచ్చుకుంది. ఇప్పుడు ప్రాజెక్టుల భూసేకరణ మళ్లీ మొదటికి వచ్చింది. మొన్ననే వైస్ చాన్స్ లర్ల నియామక ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఇది ప్రజల తెలంగాణ కాదు దొరల తెలంగాణ అని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. దొరల రాజ్యం తరహాలోనే ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శలకు అవకాశమిచ్చేలా ప్రవర్తిస్తోంది.