డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు… కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పుకునే కార్యక్రమాల్లో ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించి, పేదలకు అందివ్వాలన్న లక్ష్యంతో గృహ నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, చాలా భవనాలను శంకుస్థాపనలు చేయడం చూశాం. లబ్ధిదారులు అందరికీ సరిపోయే సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరగడం లేదన్న కొన్ని విమర్శలున్నా, ఈ పథకం అమలును కేసీఆర్ సర్కారు సీరియస్ గానే ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి వీలైనన్ని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఉంది. అయితే, పేదల గృహనిర్మాణాల విషయంలో తెలంగాణ సర్కారుకు కేంద్రం సున్నా మార్కులు వేయడం విశేషం..!
గ్రామీణ ప్రాంత పేదలకు ఒక్క ఇల్లును కూడా కేసీఆర్ కట్టి ఇచ్చింది లేదనీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజనను అమలు చేయడంలో తెలంగాణ సర్కారు చివరి స్థానంలో ఉందంటూ గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ర్యాంకింగ్స్ ప్రకటించింది. సున్నా మార్కులతో తెలంగాణ చివరి స్థానంలో ఉంటే, ఆంధ్రాకు 17వ ర్యాంకు వచ్చింది. ఇదే అంశమై కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతంలో కేంద్ర పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయిందన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తూ రెండు బెడ్ రూమ్ లు కట్టుకుంటారో, పది బెడ్ రూమ్ లు కట్టుకుంటారో వారిష్టమని వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద కేంద్రం 60 శాతం నిధులిస్తే, మిగతా 40 శాతం రాష్ట్రం పెట్టుకోవాల్సి భరించాల్సి ఉంటుంది.
తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల నిర్మాణం జరుగుతున్న సంగతి వాస్తవమే కదా. కానీ, ఒక్కటంటే ఒక్క ఇల్లూ కట్టించి పేదలకు ఇవ్వలేదని కేంద్రం వ్యాఖ్యానించడం.. ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఉంది. కేంద్రం ఎందుకిలా సున్నా మార్కులు వేసిందనేది తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మోడీ సర్కారుకు వ్యతిరేక వాణి వినిపిస్తున్నారు. భాజపాయేతర, కాంగ్రెసేతర తృతీయ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు కర్ణాటక వెళ్లి, దేవెగౌడను కలుస్తున్నారు. ఇప్పటికే, కర్ణాటకలో తెలుగువారు ఉంటున్న ప్రాంతాల్లో భాజపాకి వ్యతిరేక పవనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో దేవెగౌడని కేసీఆర్ కలవడాన్ని కూడా భాజపా వ్యతిరేక ప్రచార సంకేతాలే ఇస్తుంది. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల విషయంలో భాజపా వైఖరి పూర్తిగా మారిందనడానికి ఇది మరో ఉదాహరణ, అంతే. మరీ సున్నా మార్కులు వేయించుకునేంత అధ్వాన్నంగా గృహ నిర్మాణాలు తీరు లేదు కదా!