కోకాపేట అంటే ఎకరం వంద కోట్లు పలికే ప్రాంతం. అలాంటి చోట భారత రాష్ట్ర సమితికి ఏకంగా పదొకొండు ఎకరాలు రాసిచ్చేశారు సీఎం కేసీఆర్. అత్యంత సీక్రెట్ గా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రూ.6000 కోట్ల విలువైన స్థలాన్ని.. కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కొత్త సెక్రటేరియెట్లో గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో అత్యంత రహస్యంగా ఈ ఫైల్ క్లియర్ అయిపోయింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు కూడా బీఆర్ఎస్కు 11 ఎకరాల భూమిని కేటాయించిన విషయం మాట మాత్రమైనా ప్రస్తావించలేదు.
అధికార పార్టీ వ్యవహారం కావడంతో ఫైల్ పంపించడం, ఆమోదం తెలపడం, సర్క్యులర్ జారీ కావడం.. అంతా సీక్రెట్ గా జరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు బీఆర్ఎస్కు ఈ స్థలం ఎందుకు అంటే..కాలేజీ పెడుతుందట. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెలవప్మెంట్ పెడతామని పదకొండు ఎకరాలు కావాలని బీఆర్ఎస్ వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అంత కంటే కావాల్సిదేమని రంగారెడ్డి జిల్లా గం కలెక్టర్.. కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల జాగను హెచ్ఎండీఏ ద్వారా ఇప్పించాలని ఈ నెల 16న సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చిన మర్నాడే 17 వ తేదీన సీసీఎల్ఏ ఆ ఫైల్ ను తెలంగాణ స్టేట్ డెలవప్ మెంట్ అధారిటీకి పంపింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే బీఆర్ఎస్ కు భూమి అప్పగించాలని అధారిటీ సిఫారసు చేసింది. శుక్రవారం బీఆర్ఎస్కు కు అతి తక్కువ ధరకు భూమిని కట్టబెడ్తూ సర్క్యులర్ వచ్చింది.
గతంలో పార్టీ ఆఫీసుల కోసం కూడా ఇలా అత్యంత విలువైన భూముల్ని బీఆర్ఎస్కు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఆఫీసుకు బదులుగా ఇనిస్టిట్యూట్ పెడతామని ప్రభుత్వం స్థం తీసుకోవడం.. అదీ కూడా గుట్టు చప్పుడు కాకుండా కేటాయింపులు పూర్తయిన తర్వాత బయటకు తెలియడం చర్చనీయాంశం అవుతోంది.